Crown Prince of Abu Dhabi: భారత్ నిరాశావాద దశను దాటేసింది!: మోదీ
- అబూదాబీలో తొలి హిందూ ఆలయానికి శంకుస్థాపన
- యూఏఈ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ
- 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా మార్చాలని పిలుపు
భారతదేశం నిరాశావాద దశను అధిగమించిందని ప్రధాని మోదీ అన్నారు. నాలుగు రోజుల దక్షిణాసియా దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం దుబాయ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలను ఆయన కలిశారు. ఆగస్టు, 2015 తర్వాత దుబాయ్‌కి వెళ్లడం ఆయనకిది రెండోసారి. తొలుత అబూదాబీలోని వాహత్ అల్ కరామాలోని యూఏఈ అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అటు తర్వాత భారత్‌లో తమ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజల కలలన్నింటినీ సాకారం చేసే దిశగా మాట ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
70 ఏళ్లుగా దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కొన్ని సంస్కరణలను తీసుకొచ్చినపుడు సహజంగానే కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆయన అన్నారు. దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. 70 ఏళ్లు నెరవేరని వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టం కల ఇన్నాళ్లకు సాకారమయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు. మరింత కష్టపడి 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, మరింత సరళమైన వ్యాపార నిర్వహణ పరంగా భారత్ మాదిరిగా మరే దేశమూ గణనీయమైన పురోగతిని సాధించలేదని ప్రధాని మోదీ చెప్పారు. అబూదాబీలో నిర్మించనున్న భారత దేవాలయం బంధాలకు వారధి లాంటిదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. దశాబ్దాల తర్వాత భారత్ మళ్లీ గల్ఫ్ దేశాలతో పటిష్ట బంధాన్ని ఏర్పరుచుకుందని ఆయన చెప్పారు. కాగా, శనివారం అబాదాబీ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్‌యాన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.