Anandiben Patel: 'పకోడా' తయారీ ఓ నైపుణ్యమే : ఆనందీబెన్

  • రుచికరమైన పకోడా చేయకుంటే కస్టమర్లు రారు
  • పకోడా తయారీ పెద్ద బిజినెస్‌లకు తొలిమెట్టు
  • హోటల్, రెస్టారెంట్లనూ ప్రారంభించగలరని ఆశాభావం

ప్రధాని మోదీ 'పకోడా' వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ ఆయన వ్యాఖ్యలను సమర్థించే పనిలో పడ్డారు. పకోడా తయారీ ఓ నైపుణ్యం అని, భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యాపారాల ప్రారంభానికి అది తొలిమెట్టు అని ఆమె చెప్పుకొచ్చారు.

"ఈ రోజు పకోడా తయారు చేసి అమ్మేవారు రెండేళ్లకు హోటల్, ఆ తర్వాత నాలుగైదారేళ్లలో సొంతంగా ఓ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించే స్థాయికి ఎదుగుతారు. పకోడా తయారీ ఓ మంచి పనికాదని భావించొద్దు. మంచి పకోడా లేదా రుచికరమైన పకోడా చేయలేకపోతే కస్టమర్లు రారు" అని మోదీ పకోడా వ్యాఖ్యలకు ఆమె వివరణ ఇచ్చారు. భోపాల్‌కి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని ఛిన్‌ద్వారా జిల్లాలో జరిగిన గోండ్ మహాసభ జాతీయ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.

కాగా, ఇటీవల ఓ టీవీ ఇంటర్వూలో మోదీ మాట్లాడుతూ...తమ పాలనలో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్న సంఖ్యపై చర్చించడం కాదని, అసలు ఉపాధి కల్పన జరుగుతున్న తీరును గుర్తించాలని, పకోడా అమ్ముతున్న వ్యక్తి రోజుకు రూ.200 సంపాదిస్తుండటాన్ని కూడా ఓ ఉద్యోగం కిందే చూడాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

 ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం సోషల్ మీడియా వేదికగా పకోడా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పకోడా విక్రేతల తర్వాత ప్రభుత్వం బిచ్చగాళ్లను కూడా ఉద్యోగులుగానే పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆయన విమర్శలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభలో తప్పుబట్టారు. చిదంబరం పకోడా విక్రేతలను బిచ్చగాళ్లతో పోల్చడం సమంజసం కాదన్నారు. వారిని బిచ్చగాళ్లతో ఎలా పోల్చుతారని నిలదీశారు. ఈ రకంగా మోదీని వెనకేసుకొస్తోన్న వారి జాబితాలో తాజాగా ఆనందీబెన్ చేరడం గమనార్హం.

  • Loading...

More Telugu News