Lunar Eclips: ఉప్పల్ గ్రహణ నరబలి కేసులో పోలీసుల పురోగతి!
- ఇప్పటివరకూ రికవరీ కాని మొండెం
- రాజశేఖర్ ఇంట్లో రక్తపు మరకలు తుడిచేసిన ఆనవాళ్లు
- డీఎన్ఏ రిపోర్టు కీలకమంటున్న పోలీసులు
సంపూర్ణ చంద్రగ్రహణం రోజున హైదరాబాద్ లో జరిగిన గ్రహణ నరబలి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్, భవన యజమాని రాజశేఖరే ప్రధాన నిందితుడని భావిస్తున్నప్పటికీ, ఇప్పటివరకూ పూర్తి వాస్తవాలు వెలుగులోకి రాకపోవడం, మొండెం రికవరీ కాకపోవడంతో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను ఆశ్రయించారు.
ఇక రాజశేఖర్ ఇంటిని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీం, ఓ గది నిండా రక్తపు మరకలు ఉన్నాయని, వాటిని వివిధ రకాల రసాయనాలతో తుడిచి వేశారని గుర్తించారని తెలుస్తోంది. మొత్తం ఐదు సార్లు వాటిని తుడిచారని అనుమానించిన అధికారులు, రాజశేఖర్ ఇంట్లో లభించిన పలు నమూనాలను సేకరించారు.
ఇంటిపై లభించిన శిశువు తలలోని డీఎన్ఏను సేకరించామని, వీటిని పోలుస్తూ నివేదిక తయారైతే అసలు నిజం తెలుస్తుందని అంటున్నారు. ఇక ఫోరెన్సిక్ నివేదిక రేపు లభించనుందని, డీఎన్ఏ రిపోర్టే ఈ కేసులో కీలకమని పోలీసులు అంటున్నారు. నివేదిక రాగానే 48 గంటల్లో కేసు మిస్టరీని ఛేదిస్తామని చెబుతున్నారు.