India: అనుకున్నట్టే దొంగదెబ్బ తీసిన ఉగ్రవాదులు.. ఆర్మీ క్యాంపుపై దాడి.. ఇద్దరు జవాన్ల వీరమరణం!

  • చిమ్మచీకటిలో కాల్పులతో విరుచుకుపడిన జైషే ఉగ్రవాదులు
  • అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారం
  • ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

అనుకున్నదే అయింది. అఫ్జల్‌గురు ఉరికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్రతీకారానికి పాల్పడ్డారు. జమ్ము నుంచి శ్రీనగర్‌కు దారితీసే జాతీయ రహదారి 1ఏపై ఉన్న సంజువాన్ ఆర్మీ క్యాంపుపై దొంగదెబ్బ తీశారు. నిద్రపోతున్న వేళ కాల్పులతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. కల్నల్, ఓ చిన్నారి  సహా 9 మంది గాయపడ్డారు.

ఆర్మీ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు చాపర్లు, డ్రోన్లు ఉపయోగిస్తున్నట్టు ఆర్మీ తెలిపింది. ఐఏఎఫ్ పారా కమాండోలను జమ్ము నుంచి ఉధంపూర్, సర్సావాలకు తరలించారు.

అఫ్జల్ గురు ఐదో వర్ధంతి సందర్భంగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించాయి. ఆర్మీ అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీశారు.  జవాన్లు, వారి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడికి దిగారు. కాల్పులతో హోరెత్తించారు. వారి కాల్పుల్లో హవల్దార్ మహమ్మద్ అష్రాఫ్ మిర్, జేసీవో మదన్ లాల్ చౌదరీ అమరులయ్యారు. గాయపడిన వారిలో జేసీవో కుమార్తె నేహ కూడా ఉంది.

క్షతగాత్రుల్లో ఓ చిన్నారి సహా ఐదుగురు మహిళలు ఉన్నట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఎన్ఎన్ జోషి తెలిపారు. కాలనీలో మహిళలు, చిన్నారులు ఉండడంతో ఆపరేషన్‌ను జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ క్యాంపుపై దాడి జరగడం ఇది రెండోసారి. జూన్ 28, 2003లో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది జవాన్లు అమరులయ్యారు.

India
Army
Terrorists
Jammu And Kashmir
  • Loading...

More Telugu News