Special Package: కేంద్ర ప్రభుత్వంపై పోరాటం... అలా ముందుకు వెళతాం.. వివరించిన పవన్ కల్యాణ్
- కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం అంశాలను విస్తృతంగా చర్చించాల్సి ఉంది
- ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యా వేత్తలతో జేఎఫ్‌సీ
- ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుంది
- జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యాచరణ రూపొందిస్తుంది
గతంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగా టీడీపీ ప్రభుత్వం దానికి ఒప్పుకుందని, ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయని తీరును గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం నెలకొన్న అంశాలను విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలని అన్నారు.
ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యా వేత్తలు, సామాజిక, రాజకీయ నాయకులు తదితరులతో జేఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని అన్నారు. జేఎఫ్‌సీ ఏ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం, వివక్ష లేకుండా ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని చెప్పారు. అలాగే, జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. జేఎఫ్‌సీ అందించిన నివేదిక ప్రకారం జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు.