amit shah: అమిత్ షాకు చుక్కలు చూపిస్తామంటున్న జాట్లు.. 50 వేల ట్రాక్టర్లతో అడ్డుకునేందుకు రెడీ!

  • ఈనెల 15న జింద్ లో అమిత్ షా భారీ ర్యాలీ
  • హెలికాప్టర్ ను కూడా ల్యాండ్ కానివ్వమంటున్న జాట్ కమ్యూనిటీ
  • తమ డిమాండ్లు నెరవేర్చకపోతే చుక్కలు చూపిస్తామంటున్న జాట్లు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చుక్కలు చూపించేందుకు హర్యానాలోని జాట్లు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15న జింద్ లో అమిత్ షా ఓ భారీ ర్యాలీని చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా 50 వేల ట్రాక్టర్లతో ఆ ర్యాలీని అడ్డుకోవాలని జాట్ కమ్యూనిటీ నిర్ణయించింది. రెండు డిమాండ్లతో వీరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్ లకు రిజర్వేషన్లకు కల్పించాలని... ఇదే డిమాండ్ తో గతంలో తాము నిరసనలు చేసిన సందర్భంగా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని జాట్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమిత్ షా ర్యాలీని అడ్డుకోవడానికి జాట్లు రెడీ అయ్యారనే విషయం తెలిసిన వెంటనే... ఉద్యమకారులపై ఉన్న 70 కేసులను హర్యానా ప్రభుత్వం ఎత్తివేసింది.

ఈ సందర్భంగా అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్ పాల్ మాలిక్ మాట్లాడుతూ, అమిత్ షా హెలికాప్టర్ కూడా ల్యాండ్ కాకుండా చూస్తామని చెప్పారు. ఒకవేళ ఆయన ల్యాండ్ అయినా, 50 వేల ట్రాక్టర్లతో ర్యాలీని అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సామాజికవర్గ ప్రజలందరినీ ట్రాక్టర్లతో రావాలని ఇప్పటికే పిలుపునిచ్చామని చెప్పారు. హర్యానా ప్రభుత్వం 70 కేసులు ఎత్తి వేసినా, ఇంకా 300 కేసులు అలాగే ఉన్నాయని తెలిపారు. తమ ఉద్యమకారులను ఖట్టర్ ప్రభుత్వం బ్రిటీష్ రాజ్ కన్నా దారుణంగా చూస్తోందని మండిపడ్డారు. తమ సత్తా ఏంటో బీజేపీ అధిష్ఠానానికి చూపిస్తామని అన్నారు. 

  • Loading...

More Telugu News