Lok Sabha: సభ నడిపే పరిస్థితి లేనేలేదంటూ, లోక్ సభను మార్చి 5 వరకూ వాయిదా వేసిన సుమిత్రా మహాజన్
- తగ్గని టీడీపీ నిరసనల ఉద్ధృతి
- నినాదాలతో హోరెత్తించిన టీడీపీ సభ్యులు
- నినాదాల మధ్యే బిల్లులను ప్రవేశపెట్టిన సభ్యులు
- సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్
ఎంతకీ తెలుగుదేశం పార్టీ సభ్యుల నిరసనల ఉద్ధృతి తగ్గకపోవడంతో లోక్ సభ నడిపే పరిస్థితి లేదని చెబుతూ, బడ్జెట్ తొలి విడత సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తిరిగి మార్చి 5వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. అంతకుముందు 12 గంటలకు సభ ప్రారంభం కాగా, పలువురు సభ్యులు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాన్ని సుమిత్ర కల్పించారు.
ఆ సమయంలోనూ వెల్ లో టీడీపీ సభ్యుల నినాదాలు కొనసాగాయి. నినాదాల మధ్యే కొన్ని బిల్లులను సభ్యులు ప్రవేశపెట్టగా, ఆ తరువాత సభను వాయిదా వేస్తున్నట్టు సుమిత్ర తెలిపారు. రాజ్యసభలోనూ గందరగోళ పరిస్థితి తొలగే పరిస్థితి కనిపించక పోవడంతో సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.