Telangana: ప్రియుడి కోసం పరాయి దేశం వెళ్లింది.. అక్కడ ప్రేమలో ఓడింది!
- ఒకే కంపెనీలో ఉద్యోగం చేయడంతో ప్రేమలో పడ్డ యువతీ,యువకులు
- దుబాయ్ లో మరో నాలుగేళ్ల ప్రేమ
- మతం మారి, అంతా ఒకే అనుకున్న తరువాత పెళ్లికి నిరాకరణ
ప్రేమిస్తున్నానన్నాడు, పెళ్లిచేసుకుంటాను, దేశం దాటుదామన్నాడు. దేశం దాటాక మతం మారాలన్నాడు. మతం మారాక ఖురాన్ చదవడం రాదంటూ దొంగతనం కేసు మోపి నైస్ గా తప్పించుకున్న ఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని మల్కాజిగిరి కృపా కాంప్లెక్స్ కు చెందిన పింకిచంద (25) నాలుగేళ్ల క్రితం సోమాజిగూడలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అదే కంపెనీలో ఓల్డ్ సిటీ దారుల్ షిపా, నూర్ ఖాన్ బజార్ కు చెందిన సబ్దర్ అబ్బాస్ జైది (28) కూడా ఉద్యోగం చేసేవాడు.
ప్రొఫెషనల్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరుకావడంతో వివాహానికి ఇక్కడ ఇబ్బందని భావించి ఉద్యోగం పేరుతో అబ్బాస్ జైదీ దుబాయ్ కు వెళ్లాడు. అతని వెంటే ఉద్యోగం పేరుతో పింకిచంద కూడా దుబాయ్ వెళ్లింది. నాలుగేళ్లుగా వాళ్లిద్దరూ కలిసే ఉంటున్నారు (సహజీవనం). 2014 జులై 20న పెళ్లి చేసుకుందామంటూ దుబాయ్ నిబంధనల ప్రకారం ఆమెకు మత మార్పిడి చేయించాడు. దీంతో పింకిచంద కాస్తా ఫాతిమా జహ్రగా మారిపోయింది. 2017 ఏప్రిల్ 17న పెళ్ళి చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు.
అయితే 2017 ఏప్రిల్ 17 తరువాత ఆమెకు అసలు కష్టాలు ఆరంభమయ్యాయి. ‘ఖురాన్ చదవడం రాదు, మా మత సాంప్రదాయాలు తెలియవు’ అంటూ అబ్బాయి కుటుంబీకులు వారి పెళ్లికి నిరాకరించారు. సహజీవనం చేసిన అబ్బాస్ సైతం వారికే వంత పాడుతూ, పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేశాడు. దీంతో ఆశలు చంపుకుని గత డిసెంబర్ లో పింకిచంద ఇండియాకు బయల్దేరగా, మరోపక్క పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అబ్బాస్ తన ల్యాప్ ట్యాప్ తో పాటు విలువైన వస్తువులు దొంగలించిందని ఆమెపై ఫిర్యాదు చేశాడు.
దీంతో తనిఖీలు చేసిన పోలీసులు ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకుని, ఆమెను భారత్ కు పంపేశారు. దీంతో నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పింకిచంద ఉరఫ్ ఫాతిమా జహ్రా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అబ్బాయి ఇక్కడ లేడు కనుక కేసు నమోదు చేయమని చెప్పడంతో మీడియాతో తమ గోడు వెళ్లబోసుకుంది. దుబాయ్ లో తేల్చుకుందామంటే దొంగతనం కేసు కారణంగా తనకు ఇమ్మిగ్రేషన్ దొరకడం లేదని ఫాతిమా ఆవేదన వ్యక్తం చేసింది.