Virender Sehwag: ఐస్ క్రికెట్‌లోనూ సత్తా చాటిన సెహ్వాగ్.. బోల్తా పడిన అఫ్రిది!
- టీ20 ఐస్ క్రికెట్‌లో సెహ్వాగ్-అఫ్రిది జట్ల మధ్య తొలి పోరు
- సెహ్వాగ్ మెరిసినా తప్పని ఓటమి
- నేడు రెండో మ్యాచ్
మైదానంలో మెరుపులు మెరిపించే భారత మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఐస్ క్రికెట్‌లోనూ తనకు ఎదురులేదని నిరూపించాడు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోర్టిజ్‌లో జరిగిన ఐస్ క్రికెట్‌లో సెహ్వాగ్ పరుగుల వరద పారించాడు. వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని ప్యాలెస్ డైమండ్ రాయల్స్- షాహిద్ అఫ్రిది సారథ్యంలోని రాయల్స్ ఎలెవెన్ జట్ల మధ్య గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అఫ్రిది జట్టు విజయం సాధించింది. డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ మెరుపులు మెరిపించినా జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డైమండ్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సెహ్వాగ్ 31 బంతుల్లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండ్రూ సైమన్స్ 30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. పాక్ బౌలర్ అబ్దుల్ రజాక్ 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షోయబ్ అక్తర్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్రిది జట్టు 15.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు ఓవైస్ షా చెలరేగి ఆడాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 74 పరుగులు చేశాడు. కలిస్ 36, గ్రేమ్ స్మిత్ 23 పరుగులు చేయగా, సారథి అఫ్రిది డకౌట్ అయ్యాడు. రమేశ్ పవార్ రెండు, అగార్కర్, మలింగ చెరో వికెట్ తీసుకున్నారు. నేడు రెండో మ్యాచ్ జరగనుంది.