Narendra Modi: ప్రధాని కార్యాలయం ఘోర తప్పిదం.. కామా మర్చిపోయి వాక్యం అర్థాన్ని మార్చేసిన వైనం.. నెటిజన్ల ఫైర్!

  • పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేద్దామన్న మోదీ
  • దానిని నాసిరకమైన వైద్యంగా మార్చేసిన పీఎంఓ
  • ట్విట్టర్‌లో పేలుతున్న జోకులు

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు పీఎంఓపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఎవరికి తోచిన సలహాలు వారిచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్రమోదీ బుధవారం పార్లమెంటులో చేసిన ప్రసంగం నుంచి ఓ అంశాన్ని తీసుకున్న పీఎంవో దానిని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే ఈ క్రమంలో కామా పెట్టాల్సిన చోట ఆ విషయాన్ని మర్చిపోవడంతో దాని అర్థం పూర్తిగా మారిపోయింది. దీంతో అది చదివినవారు విస్తుపోయారు.

‘‘మనమంతా కలిసి నాసిరకమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కృషి చేద్దాం’’ అని ప్రధాని అన్నట్టు ట్వీట్ చేసింది. నిజానికి మోదీ ఉద్దేశం అదికాదు. ‘‘పేదలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు మనమంతా కృషి చేద్దాం’’ అన్నది అసలు ఉద్దేశం. అయితే ‘పూర్’ తర్వాత ‘కామ’(,) పెట్టడం మర్చిపోవడంతో దాని అర్థం పూర్తిగా మారిపోయింది.

ఈ ట్వీట్‌ను చదివిన వారు తొలుత కంగారు పడ్డారు. తర్వాత ‘కామా’ మర్చిపోయిన విషయాన్ని గుర్తించి నవ్వుకున్నారు. ‘నాసిరకం, అందుబాటులో హెల్త్‌కేర్? ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు’ అని ఓ ట్వీటరాటీ వ్యంగ్యంగా కామెంట్ చేస్తే.. ‘బీజేపీ ఇండియా భక్తుల కోసం శశిథరూర్ ఇంగ్లిష్ పాఠాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మరొకరు ట్వీటారు. అతిగా ట్వీట్లు చేస్తే ఇలాగే అవుతుందని కొందరు, దీనిని అర్జెంటుగా డిలీట్ చేయాలని ఇంకొందరు.. కామెంట్లతో ట్విట్టర్‌ను మోతెక్కించారు. కాగా, ట్వీట్ వైరల్ అయినా పీఎంఓ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. మోదీ ఖాతాలో ట్వీట్ ఇంకా దర్శనమిస్తూనే ఉంది.

  • Loading...

More Telugu News