Andhra Pradesh: గిరిజనులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి: ఏపీ సీఎస్ దినేష్ కుమార్
- విధి నిర్వహణలో ఆత్మసంతృప్తి కలిగేలా పని చేయండి
- వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్
- గిరిజన సంక్షేమాధికారులకు, ఐటీడీపీ పీవోలకు దినేష్ ఆదేశం
విధి నిర్వహణలో ఆత్మసంతృప్తి కలిగేలా పని చేస్తూ, గిరిజనులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో గిరిజన సంక్షేమంపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీడీఏ పీవోలతో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ఐటీడీఏ పీవోలతో గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, తాగునీటితో పాటు ఇతర మౌలిక సదుపాయల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
దినేష్ కుమార్ మాట్లాడుతూ, గిరిజనులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయని అన్నారు. మన్యంలో విద్య, ఆరోగ్యంపైనా, మౌలిక సదుపాయల కల్పన పైనా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గిరిజన విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. నిర్బంధ విద్యను అమలు చేసి, డ్రా పౌట్లు లేని మన్యంగా తీర్చిదిద్దడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, నాణ్యమైన విద్యనందించడమే కాకుండా, చదువుపైనా, పాఠశాలకు రావడంపైనా వారికి ఆసక్తి కలిగేలా బోధన సాగాలని ఆదేశించారు.
చదువు వల్ల కలిగే లాభాలను వివరించండి
కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా విద్యార్థులకు ఆటలపోటీలు కూడా నిర్వహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు. చదువు వల్ల కలిగే లాభాలను వాళ్లకు వివరించాలని, బడి బయట ఉండే విద్యార్థులందరినీ స్కూళ్లకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన్యం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా మాతా శిశు మరణాల రేటు తగ్గించాలని సూచించారు.
గిరిజన గ్రామాలన్నింటిలోనూ రోడ్లను నిర్మించాలని, తాగునీటి కల్పనలో అశ్రద్ధ చూపొద్దని, పరిశుద్ధమైన తాగునీటిని అందించేలా చూడాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు గిరిజనుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు అందించాలని ఆదేశించారు. గిరిజనుందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని, వారి ఆదాయ పెంపునకు కృషి చేయాలని, వారు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించాలని చెప్పారు.
అంతకుముందు, మన్యంలో విద్యార్థుల సంఖ్య, మాతా శిశు మరణాల రేటు, గిరిజన మహిళలకు అందజేస్తున్న రుణాలు, గిరిజన గ్రామాల్లో తాగునీటి కల్పన, రోడ్ల నిర్మాణం, గిరిజన యువతకు స్కిల్ డెవలప్ మెంట్ కింద చేపట్టిన శిక్షణా కార్యక్రమాల వివరాలను పవర్ ప్రజంటేషన్ ద్వారా దినేష్ కుమార్ కు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ వివరించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ, క్షేత్ర స్థాయిలో పథకాల అమలు తీరును స్వయంగా తెలుసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గంధం చంద్రులను ఈ సందర్భంగా సీఎస్ ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే, విధుల నుంచి తప్పించడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు.
ఐటీడీఏ పీవో వ్యాఖ్యలను తప్పుబట్టిన దినేష్ కుమార్
డ్రా పౌట్ల నిరోధానికి గిరిజన విద్యార్థులకు ఇన్సెంటివ్ లు ఇచ్చే ఆలోచన ఉందన్న సీతంపేట ఐటీడీఏ పీవో వ్యాఖ్యలను దినేష్ కుమార్ తప్పుబట్టారు. ఎంతమందికి ఇన్సెంటివ్ లు ఇస్తూ, పాఠశాలలకు రప్పించగలమని ప్రశ్నించారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ, నాణ్యమైన విద్యనందించాలని ఆదేశించారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, చదువు వల్ల కలిగే లాభాలను వారికి వివరించాలన్నారు.
విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాంతాల వారీగా ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ తయారు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ను ఆదేశించారు. మార్చి చివరి వారంలో గాని, ఏప్రిల్ మొదటి వారంలో గాని విశాఖపట్నంలో ఐటీడీఏ పీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.