l&t: ఎల్అండ్ టీ సంచలన నిర్ణయం... ఇకపై బీవోటీ ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమంటూ ప్రకటన
- పెట్టుబడులపై రాబడుల్లో ఆలస్యం
- ఒప్పందాల పరిమితులు
- రిస్క్ లేని ఈపీసీ కాంట్రాక్టులకే పరిమితమవుతాం
నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం (బీవోటీ) విధానంలో ఇక మీదట ప్రాజెక్టులను చేపట్టబోమని దేశీయ ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ ప్రకటించింది. ఈ తరహా ప్రాజెక్టుల పెట్టుబడులపై రాబడులు ఆలస్యం అవుతున్నాయని, ఒప్పందాలు సౌకర్యంగా ఉండకపోవడం, ప్రభుత్వాలతో న్యాయ వివాదాలు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలుగా పేర్కొంది.
తక్కువ రిస్క్ ఉండే ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) కాంట్రాక్టులకే పరిమితం అవుతామని, వీటికి మూలధన పెట్టుబడులు అవసరం ఉండదని పేర్కొంది. బీవోటీ ప్రాజెక్టులపై ఇక ఎంత మాత్రం పెట్టుబడులు పెట్టబోమని కంపెనీ మూడో క్వార్టర్ ఫలితాల సందర్భంగా కంపెనీ సీీవో, ఎండీ ఎస్ఎం సుబ్రమణియన్ వెల్లడించారు.
‘‘ఎంతో పెట్టుబడి పెడితే వాటిపై రాబడులు రావడానికి చాలా సమయం పడుతోంది. పైగా రాయితీ ఒప్పందాల పరిమితుల్లోనే పనిచేయాలి’’ అని ఆయన వివరించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ బీవోటీ విధానంలో చేపట్టిందే.