driving licence: డ్రైవింగ్ లైసెన్స్ లకూ ఆధార్ తో లింక్... నకిలీ కార్డులను ఏరివేసే ఆలోచనతో కేంద్రం!
- సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్న కేంద్రం
- ఏక కాలంలో అన్ని రాష్ట్రాల్లో అమలు
- సుప్రీంకోర్టుకు తెలిపిన కమిటీ
ఆధార్ తో ప్రస్తుతమున్న డ్రైవింగ్ లైసెన్స్ లను అనుసంధానించడం ద్వారా నకిలీ కార్డులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇందుకోసం ఏక కాలంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఉద్దేశించిన సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు ఓ కమిటీ తెలిపింది.
ఈ సాఫ్ట్ వేర్ అమలు చేస్తే నకిలీ లైసెన్స్ లేదా డూప్లికేట్ లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉండదని వివరించింది. ఆధార్ చెల్లుబాటుపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతపై సూచనల కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీయే నకిలీ లైసెన్స్ ల ఏరివేతకు ఆధార్ ను వినియోగించనున్నట్టు తెలియజేయడం గమనార్హం.