smart phone: రూ.500కే 4జీ స్మార్ట్ ఫోన్... నెలవారీ ప్లాన్ రూ.60కే!
- జియో రూ.49 ప్లాన్ తో వణికిపోతున్న కంపెనీలు
- కస్టమర్లను కోల్పోకుండా ప్రయత్నాలు
- చౌక స్మార్ట్ ఫోన్ కోసం తయారీ సంస్థలతో చర్చలు
టెలికం మార్కెట్ సామాన్యుని కాళ్ల ముందుకు వచ్చేస్తోంది. కేవలం రూ.500కే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందించే ప్రయత్నాలను భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ మొదలు పెట్టాయి. వీలైతే రూ.500 లోపులోనే 4జీ స్మార్ట్ ఫోన్ అందించే విషయమై ఫోన్ల తయారీ సంస్థలతో టెలికం ఆపరేటర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే సాధ్యమైతే ఇక ఫీచర్ ఫోన్ శకం ముగిసిపోయినట్టుగానే భావించాలి. చౌక 4జీ స్మార్ట్ ఫోన్ తో పాటు, డేటా, వాయిస్ కాల్స్ తో కూడిన ప్లాన్ ను నెలకు రూ.60-70కే అందించే ఆలోచనతో కంపెనీలు ఉన్నాయి.
ఉన్నట్టుండి టెలికం కంపెనీలకు ఈ ఆలోచన వచ్చిందేంటన్న సందేహం రాక మానదు. దీనంతటికీ కారణం రిలయన్స్ జియోనే. ఫీచర్ ఫోన్ లో కేవలం రూ.49కే అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతో కూడిన ప్లాన్ ను జియో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రస్తుత టెలికం కంపెనీలకు భయం పట్టుకుంది. పెద్ద ఎత్తున కస్టమర్లు జియో వైపు వెళతారేమోనన్న ఆందోళనతో కస్టమర్లను కోల్పోకుండా నూతన వ్యూహాలకు పథక రచన చేస్తున్నాయి. ‘‘భాగస్వామ్యంతో చౌక స్మార్ట్ ఫోన్లు అందించే ప్రయత్నాలను మొదలు పెట్టాం. దీంతో స్మార్ట్ ఫోన్లు మరింత చౌకగా మారనున్నాయి’’ అని ఒక టెలికం కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. స్మార్ట్ ఫోన్ల ధరలను ఫీచర్ ఫోన్ల ధరలకే అందించే ఉద్దేశంతో ఉన్నట్టు మరో కంపెనీ ఉద్యోగి తెలిపారు.