chenni: రౌడీగారి పుట్టిన రోజు సంబరాలు... సినీ ఫక్కీలో పోలీసుల దాడి.. 69 మంది రౌడీల అరెస్టు!
- చూళైమేడుకు చెందిన బిను పేరుమోసిన రౌడీ
- తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి రౌడీలను ఆహ్వానించిన బిను
- పక్కా సమాచారంతో సినీ ఫక్కీలో దాడి చేసిన పోలీసులు
రౌడీ జన్మదిన వేడుకల వేళ 69 మంది రౌడీలను పోలీసులు సినీ ఫక్కీలో చుట్టుముట్టి అరెస్టు చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... చెన్నై చూళైమేడుకు చెందిన బిను పేరు మోసిన రౌడీ. పరారీలో ఉన్న బిను శివారులోని మాంగాడు సమీపాన మలైయంబాక్కంలోని ఓ లారీషెడ్ లో రాత్రివేళ తన పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేశాడు. ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ తన ముఠా సభ్యులు, నగరం, శివారు ప్రాంతాల్లోని పలువురు రౌడీలు, నేరస్తులకు ఆహ్వానం పంపాడు. దీనిపై సాయంత్రం 5:45 నిమిషాలకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రౌడీలను పట్టుకోవాలని అంబత్తూరు డిప్యూటీ పోలీస్ కమిషనరు సర్వేశ్ రాజ్ టీమ్ నిర్ణయించుకుంది.
పోలీస్ జీపుల్లో వెళ్తే రౌడీలు తప్పించుకునే అవకాశం ఉందని భావించిన సర్వేశ్ రాజ్, అసిస్టెంట్ కమిషనరు కన్నన్, విల్సన్, నందకుమార్, పది మంది ఇన్ స్పెక్టర్లు, 15 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 25 మంది కానిస్టేబుళ్లు ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ పలు కార్లు, మోటారు బైక్ లు, ఆటోలు వరుసగా నిలిపి ఉన్నాయి. వాటి ఆధారంగా లారీషెడ్ లో సాయుధులైన రౌడీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో తుపాకులు ఎక్కుపెట్టి లారీషెడ్ లోకి వెళ్లారు. పోలీసులు రావడాన్ని ఊహించని రౌడీలు దిగ్భ్రాంతికి గురై తలోదిక్కు పరుగులు తీశారు.
ఎక్కుపెట్టిన తుపాకులతో బెదిరించి.. 40 మంది రౌడీలను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత షెడ్ నుంచి పరుగులు పెట్టిన వారిని వెంబడించి, ముళ్ల పొదల చాటున దాక్కున్న 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో కరుడుగట్టిన మదురవాయల్ కు చెందిన జెనిసన్, అతడి తమ్ముడు నిర్మల్, పుళియంతోపుకు చెందిన శరవణన్, పట్టాభిరామ్ కు చెందిన మాట్టు శంకర్ తదితర 10 మంది రౌడీల పట్టుబడడం విశేషం. ఘటనా స్థలి నుంచి 60 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 7 కార్లు, పలు వేటకొడవళ్లు, 35 కత్తులు, 60 ఖరీదైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లారీషెడ్ ప్రాంతంలో రౌడీల రాకతో సాయంత్రం నుంచే ఆందోళన చోటుచేసుకుంది.