Telangana: నేరస్తులైనంత మాత్రాన... ఉంపుడుగత్తె వివరాలు మీకెందుకు?: తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

  • తెలంగాణలో ఇటీవల సకల నేరస్తుల సర్వే
  • సంబంధం లేని వివరాలు అడిగిన పోలీసులు
  • ఎందుకలా చేశారో చెప్పాలన్న న్యాయమూర్తి

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సకల నేరస్తుల సర్వే సమయంలో అడిగిన ప్రశ్నలపై తెలుగు రాష్ట్రాల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి వద్దకు వెళ్లి, నీ లాయర్ ఎవరు? నీకు అప్పులు ఎవరు ఇస్తారు? నీ ఉంపుడుగత్తె ఎవరు? వంటి ప్రశ్నలను ఎలా అడుగుతారని ప్రశ్నించింది. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశమేనని జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి అభిప్రాయడ్డారు.

ఈ వివరాలు తీసుకుని ఏం సాధించాలని అనుకుంటున్నారని కూడా ఆయన పోలీసు శాఖను ప్రశ్నించారు. ఓ వ్యక్తి తరఫున కోర్టులో వాదించే లాయర్ ఎవరో చెప్పాలని ఒత్తిడి చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమని తెలియదా? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన న్యాయమూర్తి, ఇటువంటి ప్రశ్నాపత్రాలను న్యాయాధికారులను సంప్రదించకుండా ఎలా తయారు చేశారని అడిగారు.

సర్వే పేరిట బలవంతంగా వివరాల సేకరణపై పోలీసుల నుంచి వివరణ తీసుకుని, కోర్టు ముందుంచాలని ఆయన ఆదేశించారు. సకల నేరస్తుల సర్వే అంటూ, నార్త్ జోన్ డీసీపీ, మారేడుపల్లి పోలీసులు తనను వేధిస్తున్నారని మాజీ కార్పొరేటర్, హైదరాబాద్ టీడీపీ నేత చిర్రబోన బద్రీనాథ్‌ యాదవ్‌ వేసిన పిటిషన్ పై జస్టిస్ వెంకట శేషసాయి విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News