Andhra Pradesh: రోడ్డెక్కని బస్సులు, తిరగని ప్రైవేటు వాహనాలు... ఏపీలో స్తంభించిన జనజీవనం!
- బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటున్న రాజకీయ పార్టీలు
- ఈ తెల్లవారుజాము నుంచి మొదలైన ఏపీ బంద్
- డిపోల నుంచి బయటకు రాని ఆర్టీసీ బస్సులు
- పలు ప్రాంతాల్లో ఆందోళనకారుల అరెస్ట్
బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు ఈ తెల్లవారుజాము నుంచి బంద్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుటా బైఠాయించిన సీపీఐ, సీపీఎం నేతలు, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులపై నిరసన తెలిపి ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు మద్దతు పలికింది.
పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేయగా, ప్రజలు కూడా బంద్ లో పాల్గొంటున్నారు. అత్యవసర వాహనాలు మినహా మరే వాహనాలు రహదారులపై కనిపించడం లేదు. విశాఖ జిల్లా మద్దెలపాలెం వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 695 బస్సులు నిలిచిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ఏజన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
కడప, శ్రీకాకుళం, విజయవాడ ప్రాంతాల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో కదం తొక్కిన వామపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భారీ ర్యాలీని నిర్వహించాయి. తిరుపతి, తిరుమల డిపోల నుంచి బస్సులను బయటకు కదలనీయలేదు. ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పలు ప్రాంతాల్లో డ్రోన్ లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలను పోలీసులు చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.