Andhra Pradesh: నేడు ఏపీ బంద్... బంద్ కు వివిధ పార్టీల మద్దతు!
- ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు
- బంద్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన, లోక్ సత్తా పార్టీలు
- బంద్ కు మద్దతివ్వమని, కేవలం నిరసనలు మాత్రం చేస్తామని ప్రకటించిన టీడీపీ
నేడు ఆంధ్రప్రదేశ్ లో బంద్ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ బంద్ కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ప్రత్యేక రైల్వేజోన్ వంటి అంశాల ప్రస్తావన ఏదీ బడ్జెట్టులో లేకపోవడాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంను బహిరంగ లేఖ ద్వారా సీపీఐ కోరింది. అయితే బంద్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని, బంద్ ను విరమించుకోవాలని సీఎం వామపక్ష పార్టీలకు సూచించగా, వామపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి.
కాగా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తాము కేవలం నిరసనలు మాత్రం తెలుపుతామని టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్ కు మద్దతు తెలపాలని వామపక్ష పార్టీలు ఇతరపార్టీలను కోరగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన, లోక్ సత్తా తదితర పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ ను పురస్కరించుకుని విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి. అయితే ప్రభుత్వ సంస్థలు యథావిధిగా నడుస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నప్పటికీ, వాటిని అడ్డుకుంటామని ప్రజా సంఘాలు ప్రకటించాయి.