Pawan Kalyan: అందుకే టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాలను నేను విమర్శించడం లేదు: పవన్ కల్యాణ్
- రాజకీయ పార్టీల నేతలు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి
- రాజకీయం అనేది పచ్చి బూతులతో మాట్లాడుతూ చేసేది కాదు
- వినలేని పదాలతో మాట్లాడడం నాకు తెలియదు
- విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దు.. సమస్యల పరిష్కారం ముఖ్యం
అన్ని రాజకీయ పార్టీలలా ఇతర పార్టీల్లోంచి నాయకులను లాక్కోవడం వంటివి తాను చేయలేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజకీయ పార్టీల నేతలు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలని హితవు పలికారు. తాను ప్రస్తుతం అదే చేస్తున్నానని తెలిపారు. తనది కొత్తగా పుట్టిన పార్టీ అని, తన కష్టాలు తనకుంటాయని పవన్ చెప్పారు. ఉన్న సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నానని చెప్పారు.
మత్స్యకారుల సమస్య వంటి ఏ సమస్యైనా సరే ముందుగా తెలుసుకుని, దానిపై అధ్యయనం చేసి ముందుకు వెళ్లాల్సి ఉందని అన్నారు. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పుకున్న పవన్ కల్యాణ్.. టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించడం లేదని ఓ విలేకరి అడగగా, రాజకీయం అనేది పచ్చి బూతులతో మాట్లాడుతూ చేసేది కాదని, వినలేని పదాలతో మాట్లాడడం తనకు తెలియదని, అటువంటివి తాను చేయలేనని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.