Pawan Kalyan: ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణలను కలుపుకుపోతా!: పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్య
- కేంద్రం నుంచి ఏపీ ప్రయోజనాలు సాధించడం కోసం ఓ వేదిక కావాలి
- జనసేన గొంతు సరిపోవడం లేదు
- వ్యక్తిగతంగా వెళ్లి కొందరు నాయకులను కలుస్తా
- బంద్ పేరుతో మనవారిని మనం ఇబ్బందులకు గురి చేయడం సరికాదు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ ప్రకటించారని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ... అప్పట్లో తెలంగాణ కోసం అందరూ కలిశారని, లోక్‌సభను స్తంభింపజేశారని అన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను సాధించేందుకు ఓ వేదిక ఉండాలని నిర్ణయించానని తెలిపారు. మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ లాంటి వారిని కలుపుకుని ముందుకు వెళతానని చెప్పారు.
ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణలను తాను వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన గొంతు సరిపోవడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే వాటిలో అసత్యాలు ఉన్నాయని చెప్పారు. తాను రేపటి బంద్‌కు వ్యతిరేకం కాదని, కాకపోతే శాంతియుతంగా నిరసనలు జరపాల్సి ఉందని చెప్పుకొచ్చారు. బంద్‌ల పేరుతో మనవాళ్లని మనం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పారు.