Pawan Kalyan: రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోతోంది: పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు
- ప్రజలకి న్యాయం చేస్తారని మోదీ-బాబులకి మద్దతు తెలిపాను
- కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి
- ఏయే హామీలు ఇచ్చారో అవేవీ చేయడం లేదు
- ప్రత్యేక ప్యాకేజీపై తికమక పెడుతున్నారు
విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వాదనలు చెబుతున్నాయని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేదని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను ప్రజల సమస్యలు తీర్చుతారని, అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడులను సమర్థించానని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర తరువాత కూడా ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెలుసుకున్నానని తెలిపారు. ప్రత్యేక హోదాపై తాను తిరుపతి, కాకినాడల్లో సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించానని పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్ని రోజులకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీని టీడీపీ నేతలు ఒకసారి బాగుందంటారు, ఒకసారి బాగోలేదని అంటారని విమర్శించారు. ఇలా మాటలతో చాలా తికమక చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోతోందని చెప్పారు. విభజన సమయంలో ఏయే హామీలు ఇచ్చారో అవేవీ చేయడం లేదని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.