raghuveera reddy: రాష్ట్ర ప్రజలను మోదీ మరోసారి వంచించారు.. టీడీపీ, వైకాపాలు తోకముడిచాయి: రఘువీరారెడ్డి
- కాంగ్రెస్ పైన రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకున్నారు
- మోసంలో భాగం తప్ప మరేమీ కాదు
- మోదీ ఉపన్యాసం వల్ల రాష్ట్రానికి ఏ హామీ వచ్చి టీడీపీ పోరాటం ఆపేసిందో చంద్రబాబు చెప్పాలి
- మోదీ ఉపన్యాసం ప్రారంభించగానే వైసీపీ లోక్‌సభ నుంచి వెళ్లిపోయింది
రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజలను మరోసారి వంచన చేసేలా ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ సమస్యలను పక్కదోవ పట్టించే కుటిల వ్యూహంతో రాష్ట్రానికి మళ్లీ ఒక రాజకీయ అబద్ధపు ఆరోపణల ఉపన్యాసం ఇచ్చారని అన్నారు. న్యాయం కోసం ఆందోళన చేస్తోన్న రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా దగా చేశారని చెప్పారు.
'గత ఎన్నికల్లో నరేంద్రమోదీ ఇలాంటి అసత్యాలనే చెప్పి ఓట్లు దండుకున్నారు. తిరుపతి వెంకన్న దేవుని సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఇస్తామని చెప్పలేదా ? ప‌్రత్యేక హోదా అయిదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని ఇదే మోదీ చెప్పలేదా? ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని చెప్పలేదా? హోదా వెంకయ్యే సాధించారని మోదీ చెప్పలేదా?' అని రఘువీరారెడ్డి ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. నరేంద్ర మోదీ-బాబుల జోడీ ఏపీ ప్రజలకు న్యాయం చేయలేదని ఆందోళన చెందుతోంటే.. ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రధానిగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పలేదని రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పై రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకోవడం నరేంద్ర మోదీ వంచనలో, మోసంలో భాగం తప్ప మరేమీ కాదని మరోసారి రుజువైందని అన్నారు. మోదీ ఉపన్యాసం వల్ల రాష్ట్రానికి ఏమి హామీ వచ్చి టీడీపీ పోరాటం ఆపేసిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు.
'ప్రధాని మోదీ ఉపన్యాసం మొదలు పెట్టగానే తెలుగుదేశం ఎంపీలు నాటకం ఆపి తోకముడిచారు. ప్రతిపక్ష ఎంపీలు బాయ్‌కాట్ పేరిట పలాయనం చిత్తగించి పారిపోయారు. టీడీపీ, వైకాపాల పోరాటం నాటకమని, బూటకమని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన బిల్లులోని హామీలన్నీ అమలు చేయాలని కాంగ్రెస్ మొదట నుంచి పోరాడుతుందని మరోసారి సభకు చెప్పారు.
రాజ్యసభలో పోరాడుతున్న కేవీపీ రామచంద్రరరావుని సస్పెండ్ చేయడం అన్యాయం. కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకులపైన పీవీ, నీలం సంజీవరెడ్డి తదితరులపైన మోదీ చేసిన అజ్ఞానపు, అసందర్భపు వాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రస్తుత సమస్యలను పక్కదోవ పట్టించేందుకేనని రాష్ట్ర ప్రజలు గ్రహించాలి' అని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.