India: కోహ్లీ స్పీడుకు మా వాళ్లు బ్రేకులేస్తారు : పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్
- పాక్‌లో సెంచరీ విరాట్‌కు అంత సులువేమీ కాదు
- అతనో అద్భుతమైన ప్లేయర్
- అతని బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం
సెంచరీల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పీడుకి తమ బౌలర్లు బ్రేకులేస్తారని పాకిస్థాన్ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ అంటున్నారు. కోహ్లీ ఇప్పటివరకు అతను పర్యటించిన దేశాల్లో సెంచరీలు చేసి ఉండొచ్చని, కానీ పాకిస్థాన్‌లో మాత్రం అతని వంద పరుగుల దాహాన్ని తమ బౌలర్లు అడ్డుకుంటారని ఆయన ధీమాగా చెబుతున్నారు.
"కోహ్లీ ఒక అద్భుతమైన ప్లేయర్. కానీ, మా టీమ్ అతను సెంచరీ చేయకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తుంది. కోహ్లీ తాను పర్యటించిన తొమ్మిది దేశాల్లో సెంచరీ చేయడం చాలా గొప్ప విషయం. అందుకు ఆనందమే. అతని బ్యాటింగ్‌ని చూడటం ఎప్పుడూ నేను ఆస్వాదిస్తాను. కానీ, మా వాళ్లు మాత్రం పాకిస్థాన్‌లో అతను సెంచరీ చేయకుండా అతని దూకుడును అడ్డుకోగలరు" అని మిక్కీ విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2007-08 తర్వాత ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. చివరిసారిగా 2012-13 మధ్యకాలంలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ వచ్చింది. దాయాది జట్ల మధ్య పోరు ఎల్లప్పుడూ అభిమానులకు కనువిందు చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ టూర్‌కు భారత జట్టు వచ్చి ఆడుతుందనే ఆశాభావాన్ని మిక్కీ వ్యక్తం చేశారు.
కాగా, వన్డేల్లో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు (33) చేసిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. వాటిలో 18 సెంచరీలు భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి.