Andhra Pradesh: రాష్ట్రానికి అసలే నష్టం జరిగింది.. బంద్ విరమించండి: ఏపీ మంత్రుల విజ్ఞప్తి
- ఈ అంశంపై పార్లమెంటులో కలసిరావాలి
- రాష్ట్రం మూడున్నరేళ్ల చంటిబిడ్డ
- చిన్నపిల్లలను ఎలా చూసుకుంటారో అలా రాష్ట్రాన్ని చూసుకోవాలి
- చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టి ఒక స్థాయికి తీసుకువచ్చారు
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన నేపథ్యంలో వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుపై పునరాలోచన చేయాలని, బంద్ విరమించాలని ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. పోరాటం న్యాయమైనదేనని, అయితే ఈ అంశంపై పార్లమెంటులో కలసిరావాలని కోరారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈ రోజు వారు మీడియాతో మాట్లాడారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... రాష్ట్రం మూడున్నరేళ్ల చంటిబిడ్డ అని, చిన్నపిల్లలను ఎలా చూసుకుంటారో అలా రాష్ట్రాన్ని చూసుకోవాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిపెట్టి ఒక స్థాయికి తీసుకువచ్చారని చెప్పారు. ప్రపంచం అంతా మనవైపు చూస్తున్న తరుణంలో ఈ ప్రతిష్ఠని ఇంకా పెంచుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఒక పద్ధతి ప్రకారం సాధించుకోవాలన్నారు. ఎన్డీఏలో తాము భాగస్వాములైనప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం.. ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలుస్తూ నిరంతరం శ్రమిస్తూ మిత్రధర్మాన్ని పాటిస్తున్నారని చెప్పారు.
హామీల అమలు విషయంలో, కేంద్ర బడ్జెట్ కేటాయింపులలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తడంలో జాతీయ స్థాయిలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారని చెప్పారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో బంద్ చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుందన్నారు. వామపక్షాలకు ఇక్కడ శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా పార్లమెంట్ లో వారి సభ్యులు ఉన్నందున కేంద్రంపై ఢిల్లీలో పోరాడాలన్నారు.
ఈ అంశంలో ప్రధాని కల్పించుకున్నప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. మిత్రపక్షంగా ఉంటూ కేంద్రంపై ఈ విధమైన ఆందోళన చేయడం దేశంలో తాను మొదటిసారి చూస్తున్నానన్నారు. ఢిల్లీలో తమ ఎంపీలతో కలసి ఆ ఆందోళనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. బంద్ వల్ల రాష్ట్రానికి నష్టమే కాకుండా, ప్రజలు ఇబ్బందులుపడతారని, అందువల్ల వామపక్షాలు, ఇతర పార్టీలు బంద్ పై పునరాలోచన చేసి విరమించాలని అచ్చెన్నాయుడు కోరారు.
ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే ఆందోళన: ఆనందబాబు
ఎక్కడ అన్యాయం జరిగిందో అదే పార్లమెంట్ వద్ద జాతీయ స్థాయిలో ప్రతిబింబించే విధంగా ఆందోళన చేపట్టాలని మంత్రి ఆనందబాబు అన్నారు. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. హామీలు అమలు చేయమని అడగటం ఏపీ హక్కన్నారు.
ఈ విషయంలో రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలకు కూడా బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా ఆందోళనలు చేయడంలో వెనకాడేది లేదని చెప్పారు. స్పష్టత వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. ఏపీలో నిరసన తెలియజేసి, ఢిల్లీలో కలిసి ఆందోళన చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. మంచి మనసుతో ఆలోచన చేసి బంద్ పిలుపు విరమించుకోవాలని ఆనందబాబు కోరారు.