Chandrababu: రేపటి ఏపీ బంద్ పై చంద్రబాబు స్పందన!
- మన పోరాటం ఏపీలో కాదు, ఢిల్లీలో
- పార్లమెంటులో మన ఎంపీలు పోరాడుతున్నారు
- బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాలు ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు రాష్ట్రంలోని ప్రతిపక్షం వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు దుబాయ్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై మన పోరాటం రాష్ట్రంలో కాదని... ఢిల్లీలో పోరాడాలని అన్నారు.