Narendra Modi: ఏపీ నేతలకు, ప్రజలకు షాకిచ్చిన మోదీ ప్రసంగం!

  • ఏపీ కష్టాలకు కాంగ్రెసే కారణమన్న మోదీ
  • పార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించారన్న ప్రధాని
  • మోదీ ప్రసంగంలో వినిపించని విభజన హామీలు
  • తీవ్ర నిరాశలో ఏపీ ప్రజలు, నేతలు

లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఏపీ ప్రజలకు ఏమాత్రం రుచించలేదు. పైపెచ్చు, తీవ్ర నిరాశను మిగిల్చింది. విభజన హామీలపై ప్రధాని నుంచి స్పష్టమైన హామీలు వస్తాయని భావించిన వారికి చివరకు నిరాశే మిగిలింది. తన ప్రసంగంలో విభజన హామీలను ఏ మాత్రం ప్రస్తావించని మోదీ... రాష్ట్ర విభజన తప్పును కాంగ్రెస్ పార్టీపైకి తోసేశారు. ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా రాష్ట్రాన్ని విభజించాలని బీజేపీ కోరుకుందని అన్నారు.

గతంలో ఎన్డీయే హయాంలో రాష్ట్రాలను ఒక పద్ధతి ప్రకారం, ఎవరికీ అన్యాయం జరగకుండా విభజించామని... కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పార్లమెంటు తలుపులను మూసి, ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని విమర్శించారు. ఏపీ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని చెప్పారు.

తన ప్రసంగంలో ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా మోదీ ప్రస్తావించలేదు. పోలవరం, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ తదితర ఏ ఒక్క అంశం కూడా ప్రధాని ప్రసంగంలో వినపడలేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూనే, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేశారు. నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి నేతల వరకు అందరిపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు.

నెహ్రూ స్థానంలో పటేల్ ఉండి ఉంటే... కశ్మీర్ సమస్య ఉండేది కాదని అన్నారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం చేసిందని చెప్పారు. మొత్తమ్మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగాన్ని... చివరకు ఎన్నికల ప్రసంగంగా మోదీ మార్చేశారు. మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News