Maldives: మాల్దీవులకు సాయం చేయడానికి సిద్ధంగా భారత సైన్యం.. ఆదేశాలు రావడమే తరువాయి!

  • భారత పర్యాటకుల తరలింపు, సైనిక జోక్యానికి రెడీ
  • మాల్దీవుల్లో పరిస్థితుల నిశిత పరిశీలన
  • ఆదేశాలందగానే స్వల్ప వ్యవధిలోనే మోహరింపు

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడ ఏదైనా అనుకోని పరిస్థితులు తలెత్తితే సాయం చేయడానికి సిద్థంగా ఉన్నామని భారత సైనిక వర్గాలు తెలిపాయి. అక్కడ భారత పర్యాటకులను సురక్షితంగా తరలించడం మొదలుకుని సైనిక జోక్యం వరకు సాయమందించనున్నట్లు పేర్కొన్నాయి.

కానీ ఈ విషయంలో ఇప్పటివరకు తమకు ప్రభుత్వం పరంగా ఎలాంటి ఆదేశమూ అందలేదని తెలిపాయి. మాల్దీవుల్లో నెలకొన్న పరిస్థితులను సాయుధ దళాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని, ఏదైనా అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటే స్వల్ప వ్యవధిలోనే అక్కడ మోహరిస్తాయని ఆ వర్గాలు తెలిపాయి.

భారత నావికాదళానికి సంబంధించిన రెండు యుద్ధ నౌకలు ఎల్లప్పుడూ పశ్చిమ సముద్రతీరంలో గస్తీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. అవసరమైతే వాటిని మాల్దీవులకు పంపుతామని నేవీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు రక్షణ సహకారం కోసం మాల్దీవుల్లో భారత్‌కు రక్షణ దళం కూడా ఉంది. యుద్ధనౌకలు, విమానాలు, హెలికాప్టర్లు తరచూ పహారా కాస్తుంటాయని ఆయన చెప్పారు.

మాల్దీవులకు గతంలోనూ భారత్ సాయమందించింది. ఉదాహరణకు, 'ఆపరేషన్ కాక్టస్' కింద 1988లో మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ ప్రభుత్వంపై అబ్దుల్లా లుతుఫీ నేతృత్వంలో కొందరు పన్నిన కుట్రను అణచివేసేందుకు అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పారాట్రూపర్లు, నావికాదళ యుద్ధనౌకలను మాల్దీవులకు హుటాహుటిన తరలించిన సంగతి తెలిసిందే.

Maldives
Armed forces
Indian Navy
Abdullah Luthufi
  • Loading...

More Telugu News