Male: మాల్దీవుల రాజకీయాలు మీకెందుకు?: ఇండియాను ప్రశ్నిస్తున్న చైనా
- మాలేలో ఏం చేయాలని అనుకుంటున్నారు?
- కావాలనే అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్న ఇండియా
- 'గ్లోబల్ టైమ్స్' సంపాదకీయంలో కీలక వ్యాఖ్యలు
మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా భారత్ అడుగులు వేస్తున్న వేళ, ఆ దేశపు సంగతి మీకెందుకంటూ చైనా ప్రశ్నించింది. మాలేలోకి భారత్ సైన్యాన్ని పంపించరాదని డిమాండ్ చేస్తూ, వారి సంక్షోభంలో భారత్ కల్పించుకోరాదని పేర్కొంది. ఈ మేరకు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' సంపాదకీయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజకీయ అనిశ్చితి వారి అంతర్గత వ్యవహారమని, ఇండియా అక్కడికి వెళ్లి ఏమి న్యాయం చేయాలని అనుకుంటోందని ప్రశ్నించింది. ఇండియా కావాలనే మాల్దీవుల ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతోందని, ఇది సరికాదని వ్యాఖ్యానించింది. కాగా, మాల్దీవులకు సైన్యాన్ని, దూతలను పంపించి పరిస్థితి సద్దుమణిగేలా చూడాలని ఆ దేశ విపక్ష నేత పదే పదే కోరుతుండటం, ప్రజల నిరసనలను అదుపు చేసేంత సైనిక బలం ఆ దేశంలో లేకపోవడంతో, భారత సైన్యం ఏ క్షణమైనా మాలేలో కాలుపెట్టేందుకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే.