Tamilnadu: తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్?... సభ్యులను చేర్చుకుంటున్న అభిమాన సంఘం!

  • తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించిన రజనీకాంత్, కమలహాసన్
  • ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేయడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విశాల్
  • వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ప్రజలను సభ్యులుగా చేర్చుకుంటున్న విజయ్ అభిమానులు

తమిళనాట మరో సినీ నటుడి రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా కోలీవుడ్ నట దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్‌ సొంతంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని రజనీ ప్రకటించగా, ఈ నెల 21న పార్టీ పేరు, జెండా, అజెండానూ వెల్లడించి భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లేందుకు కమలహాసన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేయడం ద్వారా యువనటుడు విశాల్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చేశాడు.

ఇక ఒక రకంగా చెప్పాలంటే, వీరందరికంటే ముందే నటుడు విజయ్ రాజకీయాలపై ఆసక్తి కనబరిచాడు. గత ఎన్నికల్లో బీజేపీతో మంతనాలు కూడా సాగాయన్న వార్తలు వెలువడ్డాయి. విజయ్ రాజకీయ రంగప్రవేశంపై ఆయన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ కూడా పలు సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడారు. ఈ క్రమంలో విజయ్ తన అభిమాన సంఘాన్ని ప్రజాసంఘంగా మార్చి పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

తాజాగా రజనీ, కమల్ అభిమానులు ప్రజలను తమ పార్టీ సభ్యులుగా చేర్చుకుంటుండడంతో విజయ్ అభిమానులు కూడా తమ హీరో పేరిట 'విజయ్‌ ప్రజా సంఘం' పేరుతో నూతన వెబ్‌ సైట్‌ ను ప్రారంభించి తద్వారా ప్రజలను సభ్యులుగా చేర్చే పనికి శ్రీకారం చుట్టారు. తమ హీరోకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఎప్పుడైనా రాజకీయరంగ ప్రవేశం గురించి వెల్లడించే అవకాశం ఉండడంతో తాము సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అభిమానులు చెబుతున్నారు. 

Tamilnadu
politics
cinema politicians
rajanikanth
kamal hasan
vishal
vijay
  • Loading...

More Telugu News