subrahmanyaswami: రాష్ట్రపతికి లేఖ రాసి, బీజేపీని ఇరకాటంలో పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి!

  • ఆర్మీపై కేసు పెట్టేందుకు ఎందుకు అనుమతిచ్చారో వివరణ అడగండి
  • నిర్మలాసీతారామన్ ను మందలించండి
  • వదిలేస్తే కశ్మీర్ లో ఆర్మీపై వందలకొద్దీ కేసులు నమోదవుతాయి

రాష్ట్రపతికి లేఖ రాసి, బీజేపీని ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇరకాటంలో పడేశారు. జమ్ముకశ్మీర్‌ లోని షోపియన్‌ జిల్లాలోని ఒక గ్రామంలో కొందరు పాక్‌ అనుకూల పౌరులు ర్యాలీ తీశారు. అటుగా వెళుతున్న ఆర్మీ పెట్రోలింగ్‌ బృందంపై అకారణంగా రాళ్ల వర్షం కురిపించారు. ఒక మేజర్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీనిని ప్రతిఘటించిన సైనికులు, ఆత్మరక్షణార్థం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. దీనిపై రాష్ట్ర పోలీసులు ఆర్మీ మేజర్, ఇద్దరు జవాన్లపై హత్యానేరం కేసు పెట్టారు.

దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ మాట్లాడుతూ, రక్షణమంత్రి అనుమతి తీసుకున్నాకే తాము ఆర్మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని అన్నారు. దీనిని నిరసిస్తూ సుబ్రహ్మణ్య స్వామి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు లేఖ రాశారు. ఆర్మీ మీద కేసు పెట్టడానికి అనుమతిచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ను పిలిపించి వివరణ కోరాలని, అవసరమైతే మందలించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

కశ్మీర్ లో ఇలాంటి కేసుల సంస్కృతి మొదలైతే ఆర్మీపై మున్ముందు వందలకొద్దీ కేసులు నమోదవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇండియన్ ఆర్మీ నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతుందని ఆయన తన లేఖలో హెచ్చరించారు. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 77 (1) ప్రకారం ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలూ రాష్ట్రపతి పేరిటే ఉంటాయి. కాబట్టి మీరు రక్షణమంత్రిని పిలిపించి మాట్లాడవచ్చునని సుబ్రహ్మణ్య స్వామి రాష్ట్రపతికి సూచించారు.

  • Loading...

More Telugu News