Andhra Pradesh: కాలువలు, మురుగు కాలువలలో ప్లాస్టిక్ వస్తువులు వేయకుండా నియంత్రించండి: ఏపీ సీఎస్ ఆదేశాలు

  • పట్టణ మౌలిక సౌకర్యాల పరంగా పట్టణాలను తీర్చిదిద్దాలి
  • కేబుళ్లు, వైర్లు వేసేందుకు ఇష్టానుసారం రోడ్లు తవ్వకుండా నివారించాలి
  • ప్రజా అవసరాలకు అనుగుణంగా తగిన పబ్లిక్ టాయిలెట్ల సౌకర్యం కల్పించండి
  • వ్యర్థాల నుండి ఇంధన తయారీ (వేస్టు టు ఎనర్జీ) ప్రాజెక్టులపై మరింత దృష్టి

నగరాలు, పట్టణాల్లో కాలువలు, మురుగు కాలువలలో ఇష్టానుసారం ప్లాస్టిక్ వస్తువులను వేయకుండా నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు వెలగపూడి సచివాలయంలో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సుఫార్మేషన్) పథ‌కానికి సంబంధించి 8వ రాష్ట్రస్థాయి హైపవర్ స్టీరింగ్ కమిటీ (SHPSC) స‌మావేశం జ‌రిగింది.

ఈ స‌మావేశంలో సీఎస్ మాట్లాడుతూ.... న‌గ‌రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలువలు, డ్రైన్లలో ఇష్టానుసారం ప్లాస్టిక్ వస్తువులను వేయడం వల్ల జల, వాయు కాలుష్యం జ‌రుగుతోందని, దీనిని పూర్తిగా నివారించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.

అదే విధంగా రోడ్ల ప‌క్కన చెత్తను, ఇతర వ్యర్థ‌ పదార్థాలను కుప్పలుగా వేయడం ద్వారా దుర్గంధం వ్యాపించడంతోపాటు ప్రజలు అనేక రకాల అనారోగ్యాలకు లోనుకావాల్సి వస్తోందని, దీనిపై కూడా తగిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సీఎస్ అన్నారు. రోడ్ల వెంబడి వైర్లు, ఇతర కేబుల్ వైర్లను వేసేందుకు రోడ్లను ఇష్టానుసారం తవ్వకుండా నివారించేందుకు గొట్టాల ద్వారా అలాంటి వైర్లు, కేబుల్స్ వేసేందుకు వీలుగా పీపీపీ  విధానంలో ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆయ‌న‌ ఆదేశించారు.

తాగునీరు, మరుగుదొడ్లు, రెయిన్ వాటర్, స్ట్రారమ్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ప్లాస్టిక్ వస్తువుల సమస్య వంటి ఐదారు ప్రధాన పట్టణ కనీస మౌలిక సదుపాయాల పరంగా కొన్ని నగరాలు, పట్టణాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ టాయిలెట్లను ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో పరిశీలించి అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం ద్వారా సుందర, పరిశుభ్రమైన పట్టణ, నగరాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అంతేగాక రోడ్డు సైడ్ సౌకర్యాల కింద వివిధ జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారుల వెంబడి తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. అలాగే, ఆయా రహదారుల వెంబడి గల వివిధ పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపార వాణిజ్య కేంద్రాల పరిధిలోను, మార్కెట్లు, వంటి చోట్ల నిర్వహించే టాయిలెట్లు ప్రజలందరూ వినియోగించేందుకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోని నగరాలు, పట్టణాల్లోని రహదారులపై ఎంతదూరంలో పబ్లిక్ టాయిలెట్ అందుబాటులో ఉందనేది ప్రత్యేక సైనేజి బోర్డుల ద్వారా తెలియ‌జేస్తార‌ని, అదే రీతిలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని సీఎస్ చెప్పారు. ప్రాంతాల వారీగా పారిశుద్ధ్య‌ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి వారి పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి బాగా పనిచేసే సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలను అందించాలని చెప్పారు. అంతేగాక, నిబంధనలను ఉల్లంఘించే వారి నుండి జరిమానాలు విధించి వసూలు చేస్తే చాలా వరకూ పట్టణాల్లో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయని దినేష్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ మాట్లాడుతూ.. లక్ష జనాభాలోపు గల 30 పట్టణాలు వరకూ అమృత్ పథ‌కం కింద కవర్ చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు, ఈ హైపవర్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ సాప్ 2016-20 ఐదేళ్ల ప్రణాళిక కింద అమృత్ పథ‌కం కింద 3,762 కోట్ల రూపాయ‌ల‌ అంచనాతో వివిధ పట్టణాల్లో తాగునీరు, సీవేజ్ వాటర్ మేనేజిమెంట్, స్టారమ్ వాటర్ డ్రైనేజి, పార్కుల, స్థలాల సుందరీకరణ వంటి 179 ప్రాజెక్టులను చేపట్టిన‌ట్లు తెలిపారు.

వాటిలో ఇప్పటికే 145 ప్రాజెక్టులకు టెండర్లు పిలవగా, 129 ప్రాజెక్టులకు ఇప్పటికే పనులు ప్రారంభం కాగా 10 ప్రాజెక్టులను పూర్తి చేసిన‌ట్లు వివరించారు. విజయవాడ నగరంలో 22 పబ్లిక్ టాయిలెట్లు, 30 కమ్యూనిటీ టాయిలెట్లు ఏర్పాటు చేయగా విశాఖపట్నంలో 107 పబ్లిక్ టాయిలెట్లు, 140 కమ్యూనిటీ టాయిలెట్లు ఏర్పాటు చేశామని వివరించారు. మిగతా నగరాలు, పట్టణాల్లో కూడా అవసరాన్ని బట్టి వీటిని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

వ్యర్థాల నుండి ఇంధన తయారీ ప్రాజెక్టులపై ఎస్ సమీక్ష..

రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తాడేపల్లి గూడెం, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూల్ లలో ఏర్పాటు చేస్తోన్న వ్యర్థాల‌ నుండి ఇంధనం (వేస్టు టు ఎనర్జీ) తయారీ  ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈమేరకు వెలగపూడి సచివాలయంలోని త‌న‌ కార్యాలయంలో ఈ ప్రాజెక్టులపై అధికారులు, డెవలపర్స్ తో సమీక్షిస్తూ నిర్దేశిత గడువు ప్రకారం సకాలంలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విశాఖపట్నం, గుంటూర్ లలో చేపట్టిన వేస్టు టు ఎనర్జీ ప్రాజెక్టుల పనులు జరుగుతుండగా మిగతా చోట్ల పనులు ప్రారంభించాల్సి ఉన్నందున త్వరితగతిన మొదలు పెట్టాలని చెప్పారు. అనంతరం ఆయా ప్రాజెక్టు ప్రాంతాలను వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా సీఎస్ పరిశీలించారు. ఈ సమావేశంలో ప్రత్యేక పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి అనంత రాము, గృహ నిర్మాణశాఖ ఎండీ కాంతి లాల్ దండే, స్వచ్ఛ‌ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ ఎన్.మురళీధర్ రెడ్డి, ఏపీ అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్ సీఈవో ప్రకాశ్ గౌర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి.ప్రభాకర్, డెవలపర్లు, తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News