Telugudesam: పార్లమెంటులో కేంద్ర మంత్రుల ప్రకటనను అంగీకరించని టీడీపీ ఎంపీలు.. ఎవరూ నమ్మే స్థితిలో లేరంటూ కౌంటర్!
- హామీలను నెరవేరుస్తామని ప్రకటించిన జైట్లీ
- ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శిని ఢిల్లీకి పిలిచామన్న ఆర్థిక మంత్రి
- టెక్నికల్ అంశాలను తెరపైకి తెస్తే, ప్రజలెవరూ నమ్మబోరన్న ఎంపీలు
విభజన హామీలకు సంబంధించి టీడీపీ ఎంపీలు ఉదయం నుంచి పట్టువీడకుండా పార్లమెంటును స్తంభింపజేశారు. నినాదాలు చేస్తూ, ప్రకార్డులను ప్రదర్శిస్తూ, వెల్ లోకి దూసుకెళ్లి సభను హోరెత్తించారు. విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో కూడా సభలో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీల అభ్యర్థనను కేంద్ర మంత్రులు తోసిపుచ్చారు. ఏపీకి సంబంధించి సభలో ప్రకటన చేస్తే... మిగిలిన పార్టీలు కూడా ఇలాగే ఆందోళనకు దిగుతాయని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని ఢిల్లీకి రమ్మని పిలిచామని, అన్ని విషయాలను ఆయనతో చర్చిస్తామని చెప్పారు. ఈ ప్రకటనతో టీడీపీ ఎంపీలు సంతృప్తి చెందలేదు. హామీలవారీగా ప్రకటనలు చేస్తేనే ప్రజలు నమ్ముతారని, ఏవేవో టెక్నికల్ అంశాలను తెరమీదకు తెస్తే ఎవరూ నమ్మే స్థితిలో లేరని తెగేసి చెప్పారు. తమ ఆందోళనను మళ్లీ ప్రారంభించారు. దీంతో, సభ మరోసారి వాయిదా పడింది.