Chandrababu: ధర్మరాజు అంతటి వాడే యుద్ధానికి ‘సై’ అన్నాడు, మరి, ఈయన ఎప్పుడంటారో చూడాలి!: ఎంపీ జేసీ
- ముఖ్యమంత్రి గారికి సహనం ఎక్కువ
- ఇంకా, ఏదో జరుగుతుందనే ఆశలో ఆయన ఉన్నారు
- ఈ సహనమే కొంపముంచుతోంది
- పార్లమెంట్ ప్రాంగణంలో జేసీ దివాకర్ రెడ్డి
నాడు ధర్మరాజు అంతటి వాడే యుద్ధానికి ‘సై’ అన్నాడు, మరి, ఈయన (చంద్రబాబు) ఎప్పుడంటారో చూడాలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నదొకటి, ఈరోజున అమలు పరుస్తామంటున్నది మరోటి అని మండిపడ్డారు. ఏపీకి ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని అన్నారని, ఇప్పుడు, ఆ ప్యాకేజీ లేదూ, పీకేజీ లేదంటూ విమర్శించారు.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తమను పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో రావాల్సిన నిధులు ఏపీకి వచ్చాయి తప్ప, మిత్రపక్షమని చెప్పి ఒక్క రాగి పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘మేము మిత్రపక్షంగా ఉండాల్సిన అవసరముందా?’ అని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి (చంద్రబాబు) గారికి సహనం ఎక్కువ. ఇంకా, ఏదో జరుగుతుందనే ఆశలో ఉన్నారు. ఆ మహానుభావుడు ఇంకెంత కాలం చూస్తాడో! ఈ సహనమే కొంపముంచుతోంది. సహనానికి కూడా హద్దుండాలి! ధర్మరాజు కంటే సహనపరుడెవరూ లేరు. ఆయన అడుగుజాడల్లో ఈయన నడుస్తున్నారు. ధర్మారాజు అంతటి వాడే ‘సై’ అన్నాడు. మరి, ఈయన (చంద్రబాబు) ఎప్పుడంటారో చూడాలి!" అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.