Loya: న్యాయస్థానాన్ని చేపల మార్కెట్ స్థాయికి దిగజార్చవద్దు!: న్యాయవాదులపై సుప్రీం ఆగ్రహం
- లోయ మృతి కేసు విచారణ సందర్భంగా వాదోపవాదాలు
- ఇద్దరు సీనియర్ లాయర్ల మధ్య వాగ్వాదంపై కోర్టు ఆగ్రహం
- కేసు తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా
న్యాయస్థానాన్ని చేపల మార్కెట్ స్థాయికి దిగజార్చవద్దని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బిహెచ్ లోయ మృతికి సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. కేసు విచారణ సందర్భంగా ఇద్దరు సీనియర్ న్యాయవాదులు దుశ్యన్ దవే, పల్లవ్ శిసోడియా మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది.
ఇలా వాదించుకోవడం ఆమోదయోగ్యం కాదంటూ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. "కోర్టు గదిలో వాదనలను మనం చేపల మార్కెట్ స్థాయికి తగ్గించరాదు. న్యాయమూర్తి చెబుతున్న మాటలను మీరు పెడచెవిన పెట్టరాదు. మిస్టర్ దవే... మీరు నా మాటను ఆలకించాలి. మీకు అవకాశం ఇచ్చినప్పుడే మాట్లాడండి" అంటూ బాంబే న్యాయవాదుల సంఘానికి ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది దవేకి ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ డివై చంద్రచూద్ సూచించారు.
ఇలాంటి వాదన క్షమార్హం కాదని, ఇద్దరు న్యాయవాదుల భాష చేపల మార్కెట్టును తలపించడం సిగ్గుచేటని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంత వారించినా న్యాయవాదుల మధ్య వాదనలు సద్దుమణగకపోవడంతో ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం బెంచ్ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.