Narendra Modi: మోదీ హామీలు ఇవ్వడం కాదు.. లోక్ సభలో ప్రకటిస్తేనే ఆందోళన ఆపండి!: టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
- విజయసాయిరెడ్డికి అపాయింట్ మెంట్ ఇస్తే.. పీఎంఓకే అవమానం
- రాష్ట్రానికి ఏం చేస్తారో లోక్ సభలో ప్రధాని ప్రకటించాలి
- అప్పటిదాకా ఆందోళనలు చేపట్టండి
ప్రధానమంత్రి కార్యాలయం కారిడార్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుగుతూ, దర్యాప్తు సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పీఎంఓ పరిసరాల్లోకి ఇలాంటి వ్యక్తిని అనుమతించరాదని అన్నారు. విజయసాయికి అపాయింట్ మెంట్ ఇస్తే... అది పీఎంవోకే అవమానకరమని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును విజయసాయి కలిసిన విషయాన్ని... టీడీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ రోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ హామీలు ఇవ్వడం కాదని... ఇచ్చిన హామీలను లోక్ సభలో ప్రకటిస్తేనే ఆందోళన విరమించాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పటి వరకు పార్లమెంట్ లో ఆందోళనలను కొనసాగించాలని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందనే విషయాన్ని పార్లమెంటులో చెప్పనివ్వాలని... ఆ తర్వాత ఆందోళనలపై నిర్ణయం తీసుకుందామని సూచించారు.