colour: నిజస్వరూపాన్ని తెలిపే ఫేవరేట్ రంగు.. ఒకసారి చెక్ చేసుకోండి!
- నలుపు రంగు నచ్చే వాళ్లు నాయకులు
- ఎరుపు రంగు ఇష్టపడేవారు అన్వేషకులు
- పచ్చ రంగు నచ్చితే సాహసికులు
జ్యోతిష్యం, హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం, వాస్తు శాస్త్రం.. ఇలా ఎవరికి నచ్చిన శాస్త్రాన్ని వారు విశ్వసిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పురోగతి సాధిస్తున్నా... ఇప్పటికీ శాస్త్రాలకే ప్రజలు విపరీతమైన విలువ ఇస్తున్నారు. సరే... ఇదంతా విశ్వాసాలకు సంబంధించిన విషయం. తాజాగా మనకు నచ్చిన రంగును బట్టి మన నిజ వ్యక్తిత్వం ఇట్టే తెలిసిపోతుందట. అదేంటో ఒకసారి తెలుసుకుందాం.
నలుపు రంగు..
నలుపు రంగును ఇష్టపడే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. వీరు సాధారణంగా నాయకులుగా ఉంటారు. నాయకత్వ లక్షణాలతో పదిమందిని పాలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మనసు మాటే వింటారు. అందువల్ల వీరు ఆధిపత్య ధోరణి కల్గి ఉన్నట్లు ఎదుటివారికి కన్పిస్తారు. నిజానికి మీది చాలా ఔదార్యంతో కూడిన విశాల హృదయం. వీరికి జీవితం పట్ల చాలా క్లిష్టమైన, ప్రాక్టికల్ ధోరణి ఉంటుంది. అందువల్ల వృత్తిక్షేత్రంలో వీరు ఉత్తమ విశ్లేషకులుగానూ, మేధావులుగానూ మన్ననలు అందుకుంటుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో వీరి నిక్కచ్చి వ్యవహారశైలి వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తమ భావోద్వేగాలను బయటకు ప్రదర్శించేందుకు వీరు ఇష్టపడరు.
ఎరుపు రంగు..
ఒకవేళ మీకు నచ్చిన రంగు ఎరుపైతే... ఈ రంగును ఇష్టపడే వాళ్లు అన్వేషకులుగా ఉంటారు. శోధనపై ఆసక్తి అధికం. వీరికి అంతర్మథనం, ఆత్మపరిశీలనా అధికమే. పైపై మెరుగులు ప్రదర్శించే వారంటే వీరికి నచ్చదు. కొత్త పనులంటే అమితాసక్తి. ప్రయాణమన్నా కూడా ఇష్టమే. విధేయత కలిగిన మిత్రులుగా ఉంటారు. వివిధ రకాల వ్యక్తులను కలుసుకోవడం, వారి గురించి తెలుసుకోవడమంటే వీరికి చాలా ఆసక్తి. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల పట్ల కూడా వీరు అభిరుచిని కలిగి ఉంటారు. వీరు స్వాప్నికులుగా ఉంటారు. ఇతర స్వాప్నికులతో సాంగత్యాన్ని ఇష్టపడుతారు.
పసుపు రంగు..
ఒకవేళ మీకు నచ్చిన రంగు పసుపైతే... మీరు చాలా జాగరూకతతో వ్యవహరించే వ్యక్తులుగా ఉంటారు. సున్నిత మనస్కులుగానూ మృదుభాషిగానూ ఉంటారు. వాస్తవానికి ఇలాంటి లక్షణాల వల్లే వీరు నలుగురిలో ప్రశంసలు అందుకుంటుంటారు. వీరికి సృజనాత్మకత అధికంగా ఉంటుంది. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో వీరు దిట్ట. భవిష్యత్తు పరంగా వీరికి పక్కా ప్లానింగ్ ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో వీరు కాస్త సిగ్గుపడుతుంటారు. తమ మదిలో ఉన్న చాలా విషయాలను బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు.
గులాబీ రంగు..
ఒకవేళ మీకు గులాబీ రంగు నచ్చితే...మీరు జీవితంలో సమతుల్యతతో వ్యవహరిస్తుంటారు. అన్ని కోణాల్లోనూ మీ జీవితం పట్టుతప్పకుండా ఉండాలని అభిలషిస్తారు. మీరు ఆశావహులు. గొడవలంటే గిట్టవు. సజ్జనులతో సాంగత్యం చేస్తారు. జీవితంలోని అన్ని దశల్లో స్థిరత్వం కోసం పాటుపడతారు. మీరు రూపవంతులు. మీ చుట్టూ ఉన్న వారంటే మీకు చాలా ఇష్టం. కానీ, అదే సమయంలో, స్వతంత్రంగా ఉండాలని మీరు భావిస్తారు. సమాజంలోని అనేక పద్ధతుల గురించి మీరు పెద్దగా పట్టించుకోరు. స్వేచ్ఛగా ఆత్మ ప్రబోధం మేరకు నడుచుకునే వారుగా ఉంటారు.
తెలుపు రంగు..
తెలుపు తెలుపు రంగు ఏం చెబుతుంది?తెలుపు రంగు ఏం చెబుతుంది?
ఒకవేళ మీకు తెలుపు రంగు నచ్చితే...మీరు రహస్య ప్రవర్తన కలిగి ఉంటారు. మీ సొంత పంథాను ఎంచుకుంటారు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటూ ధైర్యంగా ముందుకు సాగుతుంటారు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మీ చర్యల తాలూకూ పర్యవసానాలను మీరు పరిగణనలోకి తీసుకోరు. వాటిని మీరు నియంత్రించలేరు కూడా. కానీ, ఇదే మిమ్మల్ని మరింత దృఢంగా మలుస్తుంది. మీకు కోపం అధికం.
నారింజ రంగు..
ఒకవేళ మీకు నారింజ రంగు నచ్చితే...మీరు సామాజిక సీతాకోకచిలుక మాదిరిగా వ్యవహరిస్తారు. అంటే, మీరు ఒక రకంగా పసుపు రంగును ఇష్టపడే వారికి జిరాక్సు కాపీ లాంటి వారు. దాదాపుగా వారి లక్షణాలు మీ లక్షణాలు దగ్గరగా ఉంటాయి. మీరు మీ పట్ల జాగ్రత్తగా ఉండటమే కాక మీరిష్టపడే వారిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. కల్పనాశక్తి అధికం. మీరు ఎక్కువగా బాహ్యముఖంగా ఉంటారు. తక్షణ స్పందనకారులు. మీకు థ్రిల్ కల్గించే విషయాలంటే చాలా ఇష్టం. శక్తిమంతులుగానూ, వర్తమానంలో జీవించే వారుగానూ ఉంటారు. మీకు స్నేహితులు ఎక్కువే. కానీ, మీకు సంబంధించిన కొన్ని విషయాలను మీరు గోప్యంగా ఉంచుతారు. మీ బాధను ఇతరులకు చెప్పరాదనే భావనతో ఉంటారు.
ఊదా రంగు..
ఒకవేళ మీకు ఊదా రంగు నచ్చితే...మీరు అంతర్ముఖులుగా ఉంటారు. మీరు నిజంగా సృజనాత్మకంగా ఉంటారు. మీరు చాలా తెలివైన వారు. ఏవేవో అద్భుతాలు చేసేయాలంటూ ఊహల్లో కొట్టుకుపోతుంటారు. మీ వ్యక్తిత్వాన్నే మీరు అధికంగా ఇష్టపడుతారు. ఈ గుణం బహుశా మిమ్మల్ని మీరు బయటకు వ్యక్తం చేసుకోవడానికి అవసరమైన శక్తిసామర్థ్యాన్ని బయటకు ప్రదర్శించేలా చేయవచ్చు. మరోవైపు మీరు అజ్ఞాతంలో ఉంటూ ఇతరులు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోరాదని కూడా మీరు కోరుకుంటారు. ప్రశాంతమైన ప్రదేశాలంటే మీకిష్టం. ఈ లక్షణం వల్ల మీరు పలు మనోహరమైన, నిర్మలమైన ప్రదేశాలను చుట్టేలా ప్రేరేపిస్తుంది.
పచ్చ రంగు..
ఒకవేళ మీకు పచ్చ రంగు నచ్చితే...మీరు సాహసికులుగా ఉంటారు. దూకుడు స్వభావంతో దూసుకుపోవాలనుకుంటారు. జీవితంలో ప్రతి క్షణం మజా కావాలనుకుంటారు. కానీ, కొన్నిసార్లు మీరు దురహంకారాన్ని ప్రదర్శిస్తారు. ఈ కారణంగా మీరు ఎదుటి వారితో పోరాడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మీకు ఔదార్యం అధికం. స్వేచ్ఛా భావాలతో ఉంటారు. విందు వినోదాలంటే చాలా ఇష్టం. మీరు అవిరామంగా ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉంటారు. మీకు రెండు విరుద్ధ లక్షణాలుంటాయి. ఒకటి స్వేచ్ఛాయుతంగా వ్యవహరించడం, రెండోది కోపోద్రిక్తులుగా కన్పించడం. మొత్తంగా చూస్తే, ఇవి పరస్పరం సర్దుబాటవుతుంటాయి.
నీలి రంగు..
ఒకవేళ మీకు నీలి రంగు నచ్చితే...మీరు వ్యాపార లక్షణాలు కల్గి ఉంటారు. తల బిరుసు ఉంటుంది. పని పట్ల అంకితభావం అధికం. ఇతరులు చెప్పాల్సిన పని లేదన్న భావనతో స్వతంత్ర నిర్ణయాలకే ప్రాధాన్యతనిస్తారు. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. ఈ లక్షణం వల్ల మీరు అద్భుతమైన నాయకుడిగా ఎదుగుతారు. కానీ, ఇతరుల సలహాలకు విలువ ఇవ్వకపోవడం వల్ల మీరు కొన్ని సందర్భాల్లో ఓటమిపాలయ్యే ప్రమాదముంటుంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు ఇతరులకు సలహాలిచ్చే స్థితిలోనే కొనసాగుతారు.
గోధుమ వర్ణం..
ఒకవేళ మీకు గోధుమ రంగు నచ్చితే...మీరు పరిపూర్ణతావాదిగా ఉంటారు. ఇతరుల ఆదర్శభావాలను అనుసరించడంతో పాటు స్వతహాగానూ మీకు ఆదర్శ భావాలుంటాయి. ఇతరుల నుండి చాలా పనులు ఆశిస్తారు. అందువల్ల మీ జీవితంలో ఎక్కువగా అసంతృప్తికి, మనోవేదనకు గురవుతుంటారు. వాస్తవానికి, ఈ గుణం వల్ల మీరు ఇతరులతో మనస్పర్థలను ఏర్పరుచుకుంటారు. అయినా సరే మీ మొండి పట్టుదలను వదులుకోలేరు. అంతేకాక భూమాత మాదిరిగా దయా గుణంతో మీరు వ్యవహరిస్తుంటారు.