Yadadri Bhuvanagiri District: భువనగిరి 'హాట్ కాలింగ్' గ్యాంగ్ పై బాధితురాలు చెబుతున్న వాస్తవాలు!
- పోలీసుల అదుపులో నిందితులు వీరేశం, భవానీ
- ఔట్ గోయింగ్ లేని సిమ్ కార్డులిచ్చి బూతుమాటల దందా
- ఇమడలేక ఫిర్యాదు చేద్దామంటే 'లైట్ తీస్కో'మన్న సహోద్యోగులు
- బాధితురాలి ఫిర్యాదుతో కదిలిన డొంక
తనకు మంచి ఉద్యోగం ఇస్తానని ఆశపెట్టి, కాల్ సెంటర్ లో కూర్చుని మాట్లాడితే సరిపోతుందని నమ్మబలికి, ఆపై కస్టమర్లతో సెక్స్ సంభాషణలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అదేమని అడిగితే, తాను సంతకాలు పెట్టిన కాగితాలు చూపించి బెదిరింపులకు దిగుతున్నారని ఓ యువతి భువనగిరి పోలీసులను ఆశ్రయించగా, 'హాట్ కాలింగ్' గ్యాంగ్ బండారం బట్టబయలైన సంగతి తెలిసిందే. కాల్ సెంటర్ పై దాడి చేసిన పోలీసులకు 12 మంది యువతులు ఫోన్ల ముందు కూర్చుని పట్టుబడ్డారు. ఈ కేసులో కాల్ సెంటర్ నిర్వాహకులు వీరేశం, భవానీలను అరెస్ట్ చేశామని తెలిపారు. వీరేశం గుంటూరు నుంచి భువనగిరి ప్రాంతానికి వచ్చి భవానితో పరిచయం పెంచుకుని ఈ దందా ప్రారంభించాడని చెప్పారు.
ఇక తనకు ఎదురైన అనుభవంపై ఫిర్యాదు చేసిన యువతి మాట్లాడుతూ, తన గొంతు చాలా బాగుందని, కాల్ సెంటర్ లో 20 వేల రూపాయలతో ఉద్యోగం ఇస్తామని చెబితే, ఆశపడి ఆ సెంటర్ కు వెళ్లానని చెప్పింది. ఆపై అక్కడ అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు అసలు విషయం చెప్పగానే తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పింది. భవానీ తనతో మాట్లాడుతూ, కేవలం ఫోన్ లో మాటలేనని, ఎవరికీ ముఖం తెలియదు కాబట్టి, భయం లేకుండా మాట్లాడవచ్చని చెప్పిందని, తాను కస్టమర్లను తీసుకొస్తే భారీగా కమిషన్ ఇస్తానని ఆశ పెట్టిందని చెప్పుకొచ్చింది.
ఆక్కడి వారికి ఔట్ గోయింగ్ సౌకర్యం లేని సిమ్ కార్డులు, రికార్డింగ్ సౌకర్యం లేని ఫోన్లు ఇస్తారని, వాటికి ఎవరైనా కాల్ చేస్తే, వారితో బూతు మాటలు మాట్లాడుతూ, వారికి కావాల్సిన విధంగా శృంగార సంభాషణలు జరపాల్సి వుంటుందని వెల్లడించింది. కస్టమర్లు తమ కాల్ ను కట్ చేయకుండా ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత బాగా వారిని ఎంటర్ టెయిన్ చేసినట్టని చెప్పేవారని, జీతంతో పాటు ఇంక్రిమెంట్లు ఇస్తామని ఆశ పెట్టారని బాధితురాలు చెప్పింది. తాను ఇమడలేక, ఆ విషయాన్ని తోటి ఉద్యోగినులకు చెబితే, అందరూ 'లైట్ తీస్కో'మని సలహా ఇచ్చారే తప్ప ఫిర్యాదు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని వాపోయింది. చివరకు తాను ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.