Hafiz Saeed: దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి: పాక్ సర్కార్‌కి హఫీజ్ సయీద్ సవాల్
- కశ్మీర్ కోసం పోరాటం కొనసాగుతుంది
- ఈ ఏడాదంతా కశ్మీరీలకే అంకితం చేసి తీరుతా
- నవాజ్ షరీఫ్ పైనా హఫీజ్ విమర్శలు
దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ జమాత్ ఉద్ దవా (జుద్) చీఫ్, ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ప్రభుత్వానికి సవాలు విసిరాడు. కశ్మీర్ ప్రజల కోసం తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశాడు. "ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం నన్ను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి అరెస్టు చేసుకోవచ్చు. కానీ, కశ్మీరీల కోసం నేను ఈ ఏడాదంతా అంకితం చేసి తీరుతా. దీనిని ఎవరూ అడ్డుకోలేరు" అని లాహోర్‌లో ర్యాలీ సందర్భంగా ఆయన తెగేసి చెప్పాడు.
తమను అణగదొక్కాలని చూస్తే మరింత మమేకమై ముందుగు సాగుతామని స్పష్టం చేశాడు. హఫీజ్ పనిలో పనిగా పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి సరైన రీతిలో నవాజ్ తన పాత్రను సమర్థవంతంగా పోషించలేదని ఆయన విమర్శించాడు.
"కశ్మీర్ స్వేచ్ఛ కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తే, మేమంతా నిన్ను (షరీఫ్) తిరిగి పాక్ ప్రధానిగా చేసేందుకు పాటుపడగలం" అని హఫీజ్ అన్నాడు. అమెరికా, భారత్ నుండి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా పాకిస్థాన్‌లో తమ మీడియా కవరేజీలు నిషేధానికి గురైనట్లు ఆయన ఆరోపించాడు. కాగా, హఫీజ్‌ను ప్రత్యేక అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నవంబరులో పాకిస్థాన్‌లో గృహనిర్బంధం నుండి విముక్తి పొందిన హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల నజరానాని అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.