Padmaavat: ‘పద్మావత్’ అయిపోయింది.. ఇప్పుడు ‘మణికర్ణిక’ వంతు.. సినిమాను ఆపాలంటూ బ్రాహ్మణ సంఘాల డిమాండ్
- రాణి లక్ష్మీబాయ్-బ్రిటిష్ అధికారికి మధ్య లవ్ సాంగ్?
- వివాదాస్పద అంశాలు లేవని హామీ ఇస్తేనే షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న బ్రాహ్మణ సంఘాలు
- ఆందోళనలు వెల్లువెత్తకముందే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
బాలీవుడ్ సినిమాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ‘పద్మావత్’ సినిమాను నిషేధించాలంటూ రాజ్‌పుత్ కర్ణిసేన దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించగా, ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు రోడ్డుపైకి వచ్చాయి. కంగన రనౌత్ ముఖ్యపాత్రలో నటించిన చారిత్రక నేపథ్యం కలిగిన ‘మణికర్ణిక’ సినిమాపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణను వెంటనే ఆపాల్సిందిగా సర్వ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా సోమవారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.
చారిత్రక వాస్తవాలు నాశనం కాకండా చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండవని దర్శకనిర్మాతలు హామీ ఇచ్చాకే సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలన్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం మూడు రోజుల్లోగా స్పందించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, హోం మంత్రి గులాబ్ చంద్ కటారియాను కలవనున్నట్టు సురేశ్ మిశ్రా తెలిపారు.
ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారితో లక్ష్మీబాయ్‌కు లవ్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసిందని మిశ్రా పేర్కొన్నారు. జైశ్రీ మిశ్రా రాసిన వివాదాస్పద పుస్తకం ‘రాణి’ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. ‘పద్మావత్’లా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగకముందే సినిమా దర్శక, నిర్మాతలు, ప్రభుత్వం స్పందించాలని మిశ్రా కోరారు.