BJP: తీవ్ర దుమారం రేపుతున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ, సినీ నటి రమ్య వ్యాఖ్యలు!
- ప్రధాని ‘టాప్’ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎంపీ రమ్య
- ప్రధాని ‘పాట్’లో ఉన్నారని వ్యాఖ్య
- చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్
బెంగళూరులో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ‘టాప్’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి, మాజీ ఎంపీ, సినీ నటి రమ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ బెంగళూరు ర్యాలీలో మాట్లాడుతూ రైతులే తనకు ‘టాప్’ (టి-టమోటా, ఒ-ఆనియన్, పి-పొటాటో) ప్రాధాన్యమని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలకు స్పందనగా రమ్య ట్వీట్ చేస్తూ ‘మీరు ‘పాట్’(పీవోటీ- మత్తు)లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుందన్నమాట’ అని పేర్కొన్నారు.
రమ్య ట్వీట్‌పై దుమారం చెలరేగడంతో మరోమారు ఆమె స్పందించారు. పాట్ అంటే ‘పొటాటోస్, ఆనియన్స్, టమోటాస్’ అని ఎందుకు అనుకోకూడదంటూ తనను తాను సమర్థించుకున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ‘డ్రగ్స్ మత్తు’ అనే అర్థం లోనే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమ్యపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రమ్య ట్వీట్‌లోని అర్థమేంటో తనతో సహా దేశంలోని బీజేపీ నేతలెవరికీ తెలియదని, కానీ రాహుల్‌కు మాత్రం వెంటనే అర్థమైపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కాగా, రమ్య ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు.