Telugudesam: ఏపీపైన, సీఎంపైన ప్రధాని మోదీ కక్ష కట్టారు: టీడీపీ ఎంపీ జేసీ

  • ఏపీకి జరిగిన అన్యాయంపై ఎంత పోరాడినా మార్పు రాదు   
  • ఇప్పుడు, బీజేపీకి పీకుడు కావాలి
  • ఆ పీకుడు ఎలా ఉండాలనేది ముఖ్యమంత్రిగారు చెప్పాలి
  • అన్నింటికీ ‘సంయమనం’ అంటే ఎట్లా? : జేసీ దివాకర్ రెడ్డి

ఏపీపైన, సీఎం చంద్రబాబుపైన ప్రధాని నరేంద్ర మోదీ కక్ష కట్టారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై ఆయన మాట్లాడుతూ, ‘మేము ప్రయత్నం చేస్తున్నామని ప్రజలకు చెప్పుకోవడానికే తప్ప, చివరకు ఎటువంటి ఫలితాలు రావు. ఈ విషయం అందరికీ తెలిసిందే! ఈరోజున పార్లమెంట్ లో గాంధీ బొమ్మ దగ్గరకు పోయి మేము నిలబడ్డాం..వారు కనకరిస్తారా? రేపు ప్ల కార్డులు పట్టుకుని వెల్ లోకి వెళితే మార్పొస్తుందా?  ఏమీ రాదు!

రాజకీయ నాయకులు అంత సున్నితమైన వాళ్లయితే, మన బతుకులు ఇలా ఎందుకు ఉంటాయి? కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చేశారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ కనబడుతోంది. ఇది ఒక రకమైన కక్ష సాధింపు చర్యలేమోనని నాకు అనిపిస్తోంది. ఈ కక్ష సాధింపు చర్యలు మా నాయకత్వంపైనా? లేక రాష్ట్రంపైనా? నాకు అర్థం కావట్లేదు. పిల్లవాడు మాట విననప్పుడు ఒకసారి చెబుతాం, రెండు సార్లు చెబుతాం. ఆ తర్వాత ఒకటి పీకుతాం. ఇప్పుడు, బీజేపీకి పీకుడు కావాలి. ఆ పీకుడు ఎలా ఉండాలనేది ముఖ్యమంత్రిగారు చెప్పాలి .. చెయ్యాలి. ఎందుకో, ముఖ్యమంత్రి చాలా సంయమనంతో పోతున్నారు! మా ముఖ్యమంత్రిగారు చాలా బాధ్యత గల వ్యక్తి కనుక, ఆ రకంగా ఆలోచన చేస్తున్నారు. బీజేపీపై ప్రజల్లో ఏ రకమైన ఏహ్యభావం ఉందనే విషయాన్ని మనం నిరూపించాల్సిన అవసరం ఉందని మా ముఖ్యమంత్రికి ఎప్పుడో చెప్పా.. నా సలహా ఇచ్చా. అన్నింటికీ సంయమనం..సంయమనం అంటే ఎట్లా?’ అని చెప్పుకొచ్చారు.

Telugudesam
jc diwakar reddy
Chandrababu
bjp
Narendra Modi
  • Loading...

More Telugu News