Telangana: కుల వృత్తులకు పూర్వ వైభవం తెస్తాం: మంత్రి జోగు రామన్న

- చేతి వృత్తులను కాపాడుకుంటాం
- నాయీ బ్రాహ్మణులకు అత్యాధునిక పని ముట్లు
- బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న
అంతరించి పోతున్న కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఆధునిక శిక్షణ పొందిన నాయీ బ్రాహ్మణులకు చెందిన 138 యువతీ, యువకులకు కిట్స్, ధ్రువపత్రాలను మంత్రి జోగు రామన్న అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించడమే కాకుండా చేతి వృత్తులను కాపాడుకుంటామని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బలహీన, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలను అమలు చేయనున్నామని, అందులో భాగంగానే నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
నాయీ బ్రాహ్మణులు ఆత్మగౌరవంతో బతికేందుకు వారికి ఆధునిక పద్ధతుల్లో వృత్తి నైపుణ్య శిక్షణను కల్పిస్తున్నామని, వారికి అత్యాధునిక పనిముట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 3.10 లక్షల మంది నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని, దశల వారీగా దాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం కోసం రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు.