Pawan Kalyan: మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.. నిరసనలను అడ్డుకోవద్దు: పవన్ కల్యాణ్
- మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలి
- ఈ నెల 21న శ్రీకాకుళంలో పర్యటిస్తా
- వారి కష్టాలపై అధ్యయనం చేస్తా
- తీర ప్రాంతంలో కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల మత్స్యకారులు ఈ రోజు జనసేన అధినేత, సినీనటులు పవన్ కల్యాణ్‌తో సమావేశం జరిపారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మత్య్సకారుల సమస్యలు తెలుసుకున్న పవన్... అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలకు కట్టుబడి ఉండాలని, వాటిని నెరవేర్చాలని పవన్ కల్యాణ్ అన్నారు. మత్స్యకారుల సమస్యపై గురించి కమిటీ వేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని, మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నాలు జరపాలని సూచించారు.
మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, వారి సమస్యలపై మరింత అధ్యయనం చేస్తానని పవన్ తెలిపారు. తాను ఈ నెల 21న శ్రీకాకుళంలో పర్యటిస్తానని తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే, తీర ప్రాంతంలో కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శాంతియుతంగా వారు చేస్తోన్న దీక్షలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. మత్స్యాకారులను ఎస్టీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.