Amirkhan: చైనాలో సరికొత్త రికార్డు దిశగా అమీర్ 'సీక్రెట్ సూపర్‌స్టార్'
- వంద మిలియన్ డాలర్ల మార్కుకి చేరువ
- బాక్సాఫీసు వద్ద నెం.1 స్థానం పదిలం
- మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కైవసం
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సీక్రెట్ సూపర్‌స్టార్' చిత్రం చైనా బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. వంద మిలియన్ డాలర్ల మార్కుకు చేరువవుతోందని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెప్పారు. కొత్త సినిమాలకు సవాలు విసురుతూ ఇది అక్కడి బాక్సాఫీసు వద్ద నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుందని...గత ఆదివారం నాటికి 91.29 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిందని...ఈ జోరు ఇలాగే కొనసాగితే వంద మిలియన్ డాలర్ల మార్కును అధిగమించడం పెద్ద సమస్యేమీ కాదని ఆయన విశ్లేషిస్తున్నారు.
అమీర్ ఖాన్ సొంత బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా చైనా మార్కెట్‌లోకి రిలీజ్ కావడం ద్వారా గతేడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమాగానూ, ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్ల హిందీ చిత్రంగానూ నిలిచింది. మరోవైపు 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు సహా ఏకంగా పది అవార్డులకు ఈ సినిమా నామినేట్ కావడం విశేషం. అందులో ఉత్తమ నటి (జైరా వసీం), ఉత్తమ సహాయ నటి (మెహర్ విజ్), ఉత్తమ నేపథ్య గాయని (మేఘనా మిశ్రా) అవార్డులను గెలుచుకుని ఔరా అనిపించింది.