Parliament: రాజ్యాంగ సవరణలతోనే జమిలి ఎన్నికలు సాధ్యం.. ప్రభుత్వానికి ఈసీ నివేదిక!

  • ఐదు అధికరణలను సవరించాలన్న ఇసి
  • రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం తప్పనిసరి
  • అన్నీ కుదిరితే జమిలికి ఈ ఏడాది సెప్టెంబరు కల్లా రెడీ

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా తొలిరోజు సోమవారం జమిలి ఎన్నికల ప్రస్తావనను తీసుకొచ్చారు. అంతేకాక వాటి నిర్వహణకు ముందుగా అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని కూడా ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికల నిర్వహణకు ఉన్న చట్టపరమైన ఇబ్బందులను అధిగమించడం కోసం రాజ్యాంగంలోని ఐదు అధికరణలకు చేయవలసిన  సవరణలను ప్రభుత్వానికి వివరించింది. ఈ విషయంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఈసీ అభిప్రాయంతో ఏకీభవించింది. తాము సూచించిన సవరణలను గనుక ప్రభుత్వం పూర్తి చేస్తే ఈ ఏడాది సెప్టెంబరు నాటి కల్లా జమిలి ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా సమాయత్తం కాగలమని ఈసీ ఆశాభావం వ్యక్తం చేసింది.

పార్లమెంటు ఉభయసభల నిర్వహణ వ్యవధికి సంబంధించిన రాజ్యాంగంలోని 83వ అధికరణ, పార్లమెంటు సమావేశాలు, ప్రోరోగేషన్, రద్దుకు సంబంధించిన 85వ అధికరణ, రాష్ట్ర అసెంబ్లీల కాల వ్యవధికి సంబంధించిన 172వ అధికరణ, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, ప్రోరోగేషన్, రద్దుకు సంబంధించిన 174వ అధికరణ, ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన యంత్రాంగం (రాష్ట్రపతి పాలన) వైఫల్యం చెందినపుడు ఏం చేయాలనే దానికి సంబంధించిన 356వ అధికరణకు సవరణలు చేయాలని....అప్పుడే జమిలి ఎన్నికలను ఎలాంటి చిక్కులు లేకుండా నిర్వహించగలమని ఈసీ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏకాభిప్రాయానికి రావాలని కూడా స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News