Bihar: పరీక్షల్లో కాపీయింగ్ కు ఎన్నెన్ని మార్గాలో... బీహారోళ్ల దగ్గర నేర్చుకోవాల్సిందే!
- బీహార్ లో జోరుగా సాగే మాస్ కాపీయింగ్
- చూచి రాతలు, అడ్డుకుంటే ప్రతాపం చూపడం కామన్
- వినూత్న మార్గాల్లో చీటీలను తీసుకెళ్లే విద్యార్థులు
పరీక్షల్లో పాస్ కావడానికి కాపీలు కొట్టే వారు ఎంతో మంది ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరంతా చాలా గుట్టుగా చీటీలను దాచుకుని వెళ్లి, ఆ ప్రశ్నలే రావాలని దేవుళ్లకు దండం పెడుతూ, వస్తే ఆనందిస్తూ చూసి రాసి పారేస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది దొరికిపోయి, తమ విద్యా జీవితాన్ని నాశనం చేసుకుంటారు కూడా. ఇక కాపీలు కొట్టడంలో బీహార్ విద్యార్థులు ముందుంటారన్న సంగతి తెలిసిందే.
గతంలో ఓ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులకు చీటీలను అందిస్తున్న పెద్దల ఫోటో ఒకటి దేశవ్యాప్తంగా సంచలనాన్నే కలిగించింది. కాపీ కొట్టే మార్గాలను నేర్చుకోవాలంటే బీహారోళ్ల దగ్గరే నేర్చుకోవాలని అంటున్నారు నెటిజన్లు. వారు కాపీయింగ్ కు ఎంచుకునే మార్గాలను గమనిస్తే 'ఔరా' అనాల్సిందే. ఓ తండ్రి తన కుమార్తె పరీక్ష రాస్తుంటే, ఎగ్జామ్ హాల్ పక్కనున్న ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి పెద్ద కర్ర సాయంతో చీటీలను ఆమెకు అందించాడు.
ఇక అరచేతిపై ప్రశ్నలకు సమాధానాలు రాసుకుని వెళ్లడం కూడా అందరికీ తెలిసిందే. అయితే, బీహార్ అమ్మాయిలు తమ గోర్లను పొడవుగా పెంచుకుని, వాటిపైనా సన్నని అక్షరాలు రాసుకుని పరీక్షలకు వస్తారట. ఇక చీరలు కట్టుకుని వచ్చే అమ్మాయిలైతే, తమ లోపలి దుస్తుల్లో లెక్కలేనన్ని చీటీలు దాచుకుని వచ్చి పరీక్షల్లో తమ సత్తా చూపిస్తారట.
చేతులపై సమాధానాలు రాసి ఫుల్ హ్యాండ్ షర్టులు వేసుకుని వచ్చేవారు, కాళ్లపై సమాధానాలు రాసుకుని వచ్చేవారూ బీహార్ లో లెక్కకు మించే కనిపిస్తారు. ఇంకొందరు, పరీక్షలకు రెండు రిజిస్ట్రేషన్లు చేయించుకుని బురిడీ కొట్టిస్తుంటారట. ఇక తమను ఎవరైనా ఇన్విజిలేటర్ పట్టుకుంటే, వారిపై పూలను విసిరి, పాటలు పాడుతూ హేళన చేసే అలవాటు బీహార్ విద్యార్థులకు ఉందట. తమ పిల్లలు పరీక్షలు రాస్తుంటే, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములే దగ్గరుండి చీటీలను అందిస్తుండే సంప్రదాయం బీహార్ లో చాలా ఎక్కువ. ఇక అందరూ ఒకే చోట కూర్చుని చూసి రాసుకోవడం, పుస్తకాలు పక్కన పెట్టుకుని మరీ రాస్తుండటం అక్కడ తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా గట్టిగా అడ్డుకుంటే వారిపై బీహార్ ప్రతాపం చూపిస్తారట.