saourav ganguly: ధోనీ బలవంతం వల్లే ఆ మూడు ఓవర్లు కెప్టెన్సీ చేశాను: గంగూలీ
- 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్' పేరుతో ఆత్మకథ రాసిన సౌరవ్ గంగూలీ
- తన క్రికెట్ కెరీర్ గురించిన విశేషాలు
- కెరీర్ చివరి టెస్టు గురించిన ప్రస్తావన
2008 నవంబర్ లో నాగ్ పూర్ వేదికగా ఆసీస్ తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ అనుభవాన్ని సౌరవ్ గంగూలీ తన 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్' ఆత్మకథలో రాసుకున్నారు. టీమిండియా క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకరు. తనకు ముందు సేవలందించిన కెప్టెన్ల రికార్డులను బ్రేక్ చేస్తూ కెప్టెన్ గా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. అలాంటి గంగూలీ కెరీర్ అంతిమదశలో జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో చాలా మానసిక క్షోభను అనుభవించినట్టు తెలిపాడు. ఆ బాధను చూడలేకపోయిన తన తండ్రి క్రికెట్ నుంచి రిటైర్ కావాలని సూచించారని గంగూలీ రాసుకున్నాడు.
2008 నవంబర్‌లో నాగ్ పూర్ వేదికగా ఆసీస్ తో ఆడిన నాలుగో టెస్ట్ గంగూలీకి చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కాగా, ఆ టెస్టు ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు గంగూలీ తెలిపాడు. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ స్వల్ప స్కోరుకే 9 వికెట్లు కోల్పోయిన దశలో కాసేపు కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించాలని ధోనీ తనను బలవంతం చేశాడని గంగూలీ తెలిపాడు. అంతకు ముందురోజు కూడా తనను కెప్టెన్సీ నిర్వర్తించాలని ధోనీ ఎంతగానో కోరాడని, దానికి తాను అంగీకరించలేదని గంగూలీ స్పష్టం చేశాడు. ధోనీ బలవంతం మీద కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి మూడు ఓవర్లు ఫీల్డింగ్ సెట్ చేశానని గుర్తుచేసుకున్నాడు. అప్పటికి తాను కెప్టెన్సీ స్వీకరించి సరిగ్గా 8 ఏళ్లని తెలిపాడు. మూడు ఓవర్ల తరువాత 'మహీ, ఇక నువ్వే చూసుకో' అని చెప్పేశానని తెలిపాడు.