coromandal: మద్యం సేవించి రైలులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు.. టీసీలపై దాడి
- అసభ్య పదజాలంతో మహిళలను వేధించిన కానిస్టేబుళ్లు
- మహిళా కానిస్టేబుల్‌నూ వదలని వైనం
- చివరికి అరదండాలు
రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు మద్యం మత్తులో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్‌నూ వేధించారు. ఆదివారం హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణంలో పనిచేస్తున్న కేరళకు చెందిన శ్యామ్ కుమార్, బిన్నూలు సొంతం రాష్ట్రం వెళ్లేందుకు రైలు ఎక్కారు.
రైలు విజయవాడ వచ్చాక వారికి బీ1, బీ2 బోగీల్లో సీట్లు కేటాయించారు. అయితే వారు తమ సీట్లలో కాకుండా సిబ్బందికి కేటాయించే సీట్లలో కూర్చుని టాయిలెట్‌కి వెళ్లొచ్చే మహిళలను వేధించడం మొదలుపెట్టారు. అసభ్యకర వ్యాఖ్యలతో వారిని ఇబ్బంది పెట్టసాగారు. ఆంతేకాదు.. ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు టీసీలు రంగనాథ్, రాధాకృష్ణలకు కూడా విషయం చెప్పారు. శ్యామ్ కుమార్, బిన్నూలను టీసీలు నిలదీయడంతో వారిపైనా దాడిచేశారు.
రైలులో జరుగుతున్న గొడవను గమనించిన ప్రయాణికుల్లో ఒకరు చైన్ లాగడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒంగోలు స్టేషన్‌కు సమీపంలో రైలు ఆగింది. సమాచారం అందుకున్న ఒంగోలు రైల్వే ఎస్సై కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. టీసీల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్సై తెలిపారు.