Pawan Kalyan: కడియం నర్సరీ పెంపకందారులను రైతులుగా గుర్తించాలి!: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
- ‘జనసేన’ అధినేతను కలిసిన కడియం నర్సరీ పెంపకందారులు
- తమ సమస్యలు విన్నవించుకున్న పెంపకందారులు
- సమస్యలు పరిష్కారమయ్యే వరకూ అండగా ఉంటానన్న పవన్
కడియం నర్సరీ పెంపకందారులను రైతులుగా గుర్తించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన నర్సరీ రైతులు కొందరు హైరదాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన్ని కలిశారు. వారి సమస్యలను వివరించారు. ఏపీ ప్రభుత్వం తమను రైతులుగా గుర్తించడంలేదని, వ్యాపారస్తుల్లా పరిగణిస్తుండటంతో వివిధ శాఖల అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. దీంతో పాటు, ఉచిత విద్యుత్ దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విభిన్న మొక్కలను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకు వస్తున్న కడియం నర్సరీ పెంపకందారులను తక్షణం రైతులుగా గుర్తించాలని, వారికి ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారికి ‘జనసేన’ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.