Telangana: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉంది: ప్రొఫెసర్ కోదండరామ్
- జేఏసీ విస్తృత స్థాయి సమావేశం
- కొత్త పార్టీని ఏర్పాటు చేసినా, జేఏసీని కలుపుకుని పోతాం
- జేఏసీని కాపాడుకోగలిగితేనే సమాజానికి మేలు జరిగేది
- కొత్త రాజకీయ పార్టీ గురించి ఈ నెలాఖరులోగా స్పష్టంగా చెబుతాం
తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ లోని తుర్కయాంజల్ సమీపంలోని సామా శ్రీనివాస్ రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త పార్టీని ఏర్పాటు చేసినా, జేఏసీని కలుపుకుని పోతామని అన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు రావాలంటే రాజకీయ పార్టీ అవసరమని, జేఏసీ అనేది దాని స్వభావ రీత్యా పార్టీ కాదని, దానిని పార్టీగా మార్చడమనేది మంచి సంప్రదాయం కాదని అన్నారు.
పౌరవేదికలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది కనుక, జేఏసీని కాపాడుకోగలిగితేనే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. కొత్త రాజకీయ పార్టీ గురించి ఈ నెలాఖరులోగా స్పష్టంగా చెబుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన వాడే కుర్చీలో కూర్చుంటాడని ప్రజలకు మేలు జరుగుతుందని భావించామని, ప్రస్తుత పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి ఎన్ని నివేదికలు ఇచ్చినా స్పందించలేదని, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, గట్టిగా పోరాడటం ద్వారానే ప్రజాసమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.